AI, రోబోలే అన్నీ చేస్తే… మనుషులకు పని ఉండదా? ఎలాన్ మస్క్ బిగ్ స్టేట్‌మెంట్

మరి పని లేకపోతే ప్రజలు ఎలా తింటారు? దీనికి 'యూనివర్సల్ హై ఇన్‌కమ్' అనే కాన్సెప్ట్‌ను మస్క్ తెరపైకి తెచ్చారు.

Update: 2026-06-12 17:56 GMT

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యేందుకు అడుగు దూరంలో ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, డబ్బు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. రానున్న రోజుల్లో మనం వాడే డబ్బుకు అసలు విలువే ఉండదని ఆయన బాంబు పేల్చారు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోల మయమే అవుతుందని, మనుషులు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేని రోజులు దగ్గరలోనే ఉన్నాయని మస్క్ చెబుతున్న జోస్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మనీకి విలువే ఉండదా?:

ఎలాన్ మస్క్ అంచనా ప్రకారం, భవిష్యత్తులో మనం ఇప్పుడు చూస్తున్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. "రానున్న రోజుల్లో వస్తువుల తయారీ నుండి సేవలు అందించే వరకు అన్నీ AI మరియు రోబోలే చూసుకుంటాయి. ఉత్పత్తి విపరీతంగా పెరగడం వల్ల వస్తువుల ధరలు తగ్గిపోతాయి. ఇక అప్పుడు డబ్బుకు ఉన్న డిమాండ్ లేదా విలువ తగ్గిపోతుంది" అని మస్క్ పేర్కొన్నారు. అంటే మనం రూపాయి కోసం చేసే యుద్ధం ఉండకపోవచ్చు అన్నది ఆయన ఉద్దేశం.

మనుషులకు పనులు ఉండవా?:

చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.. రోబోలే అన్నీ చేస్తే మనుషులు ఏం చేస్తారు? దీనికి మస్క్ దగ్గర ఒక క్లారిటీ ఉంది. కంప్యూటర్లు, రోబోలే అత్యంత నైపుణ్యంతో పనులు చేస్తాయి కాబట్టి, మనుషులు చేయడానికి పెద్దగా పనులు మిగలవు. "పని ఉంటేనే ఆదాయం, ఆదాయం ఉంటేనే బతుకు" అనే పాత సిద్ధాంతం కాల గర్భంలో కలిసిపోతుందని ఆయన అంటున్నారు. పని చేయడం అనేది ఒక అవసరం లాగా కాకుండా, కేవలం ఒక ఆప్షన్ లాగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జీతం బదులు ప్రభుత్వాలే డబ్బు ఇస్తాయా?:

మరి పని లేకపోతే ప్రజలు ఎలా తింటారు? దీనికి 'యూనివర్సల్ హై ఇన్‌కమ్' అనే కాన్సెప్ట్‌ను మస్క్ తెరపైకి తెచ్చారు. మనుషులకు పనులు ఉండవు కాబట్టి, ప్రభుత్వాలే నేరుగా ప్రజలకు డబ్బులు లేదా అవసరమైన సేవలను అందిస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఇక దీనివల్ల పేదరికం అనేదే ఉండదని, అందరికీ అన్నీ అందుబాటులో ఉంటాయని మస్క్ ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించి చెప్పారు.

పని, ఆదాయంపై మారుతున్న భావనలు:

మస్క్ మాటల ప్రకారం, భవిష్యత్తులో ఒక వ్యక్తికి గుర్తింపు అనేది అతను చేసే 'పని' ద్వారా రాదు. డబ్బు సంపాదించడం కోసం కాకుండా, కేవలం ఆనందం కోసం లేదా అభిరుచి కోసం మాత్రమే మనుషులు పనులు చేస్తారు. ఇక ఆదాయం, ఆస్తి అనే భావనలు పూర్తిగా మారిపోయి, మనిషి తన సమయాన్ని కేవలం సృజనాత్మక పనులకే కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

ఎలాన్ మస్క్ చెప్పిన ఈ విషయాలు వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపించినా, టెక్నాలజీ పెరుగుతున్న వేగం చూస్తుంటే ఇది నిజం కాదేమో అని కొట్టిపారేయలేం. రూ. 95 లక్షల కోట్ల సంపాదనకు చేరువలో ఉన్న వ్యక్తి డబ్బు గురించి ఇలా మాట్లాడటం నిజంగా గమనార్హం. AI విప్లవం మన జీవితాలను ఎంతగా మారుస్తుందో చూడాలి మరి, ఒకవేళ మస్క్ చెప్పింది నిజమైతే, పని లేని ఆ ప్రపంచంలో మనిషి జీవితం ఎలా ఉంటుందో కదా..

Tags:    

Similar News