ఆగస్టు 28... 25 ఏళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను మలుపుతిప్పిన రోజు
1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది టీడీపీ-వామపక్షాల కూటమి. కాంగ్రెస్ ను కేవలం 26 సీట్లకే పరిమితం చేసింది.;
కొన్ని ఉద్యమాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది... అవి జరిగేటప్పుడే సంచలనంగా మారుతుంటాయి... అనంతరం వాటి ఫలితాలు కనిపిస్తుంటాయి...! చివరకు అవే చరిత్రను మలుపు తిప్పిన ఉదంతాలుగా నిలిచిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటిదే విద్యుత్ ఉద్యమం...! వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వాన్ని కేవలం ఏడాదిలోనే డౌన్ చేసిన ఉద్యమం అది..! వరుసగా పదేళ్లు... ఆపై పరోక్షంగా ఉమ్మడి రాష్ట్రంలో శాశ్వతంగా అధికారానికి దూరం చేసిన ఉద్యమం అది..!
చంద్రబాబు ఒక్క నిర్ణయం ఎంత పనిచేసింది...?
1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది టీడీపీ-వామపక్షాల కూటమి. కాంగ్రెస్ ను కేవలం 26 సీట్లకే పరిమితం చేసింది. అయితే, ఎన్టీఆర్ తో విభేదించిన నాటి ఆర్థిక మంత్రి చంద్రబాబు 1995లో ప్రభుత్వాన్ని, టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇది జరిగి కూడా సరిగ్గా 30 ఏళ్లు (1995 సెప్టెంబరు 1). ఒక అప్పటికి 45 ఏళ్ల యువకుడైన చంద్రబాబు తనదైన పాలనతో ప్రజలను ఆకట్టుకున్నారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఆకస్మిక తనిఖీలు, అధికారులపై అక్కడికక్కడే చర్యలు వంటివాటితో పనిచేసే సీఎంగా మైలేజీ తెచ్చుకున్నారు. ఇదే సమయంలో 1999లో కార్గిల్ యుద్ధం రావడం, దీనికిముందు కేంద్రంలో వాజ్ పేయీ ప్రభుత్వాన్ని అన్నాడీఎంకే చీఫ్ జయలలిత మోసం చేసి పడిపోయేలా చేయడం, వాజ్ పేయీ పాలనపై సానుకూలత, సానుభూతి ఏర్పడ్డాయి. బీజేపీ పొత్తుతో 1999 ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఉమ్మడి ఏపీలో 180 సీట్లు సాధించారు.
-ఉమ్మడి ఏపీ పీపీసీ ప్రెసిడెంట్ గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా వాజ్ పేయీ-చంద్రబాబు గాలిలో 91 సీట్లకు పరిమితం అయింది. చంద్రబాబు రెండోసారి సీఎంగా 1999 అక్టోబరు 11న బాధ్యతలు చేపట్టారు. 26 సీట్ల పార్టీని అసెంబ్లీలో సమర్థంగా నడిపించిన పీజేఆర్ ఓడిపోవడంతో.. అసెంబ్లీలో సీఎల్పీ, ప్రతిపక్ష నేతగా వైఎస్ వచ్చారు. ఇక 2000 సంవత్సరం జూన్ లో సంస్కరణల పేరిట విద్యుత్ చార్జీలను భారీగా 20 శాతం పెంచారు అప్పటి సీఎం చంద్రబాబు. ఇది చినికిచినికి గాలివానగా మారింది. భారీ ఉద్యమానికి దారితీసింది.
కరువు పరిస్థితుల్లో...
2000 సంవత్సరంలో వర్షాలు సరిగా లేవు. ఇదే సమయంలో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం వెలువడింది. ఎవరు ఎంత చెప్పినా చంద్రబాబు వినలేదు. చార్జీలు తగ్గించలేదు. దీంతో మొదట వామపక్షాలు ఆందోళనలు ప్రారంభించాయి. బిజిలీ బంద్ (విద్యుత్ సరఫరా స్వచ్ఛందంగా ఆపివేయడం) చేపట్టాయి. నిరసనలకు దిగాయి. క్రమంగా ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉద్యమంలోకి కాలుపెట్టింది. వైఎస్ నిరాహార దీక్షకు దిగారు. అలాఅలా.. దాదాపు రెండు నెలలు జరిగింది విద్యుత్ ఉద్యమం. చివరకు 2000 ఆగస్టు 28న చలో అసెంబ్లీ చేపట్టాయి కాంగ్రెస్, వామపక్షాలు. కానీ, హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
అసెంబ్లీలో కేసీఆర్ నిరసన...
2000 సంవత్సరంలో టీడీపీలో ఉన్న కేసీఆర్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. అయినప్పటికీ కరంటు చార్జీల పెంపును ఆయన తీవ్రంగా నిరసించారు. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు. తెలంగాణలో వ్యవసాయం బోరుబావుల మీద ఆధారపడి ఎక్కువగా ఉంటుందని, ఏపీలో కాల్వల ద్వారా సాగు చేస్తారని, కరంటు చార్జీల భారం తెలంగాణ రైతుల మీదనే అధికం అని తెలంగాణ వాదం వినిపించారు. డిప్యూటీ స్పీకర్, సిద్దిపేట ఎమ్మెల్యే, టీడీపీకి రాజీనామా చేశారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను స్థాపించారు.
ఈ ఒక్క కారణంతో వ్యతిరేకత
ఇక విద్యుత్ ఉద్యమంలో వామపక్షాల పాత్ర చాలా గొప్పగా సాగింది. ఆలస్యంగానైనా కీలక పాత్ర పోషించిన వైఎస్.. పోరాట పటిమ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. బషీర్ బాగ్ ఉదంతం తర్వాత కూడా చంద్రబాబు ఎంతకూ చార్జీలను తగ్గించకపోవడంతో ఆయనపై వ్యతిరేకతను పెంచింది. 2003 నాటికి కరువు అధికమైంది. వైఎస్ ఆ ఏడాది వేసవిలో పాదయాత్ర చేపట్టి ప్రజలను పూర్తిగా తనవైపు తిప్పుకొన్నారు. మరోవైపు టీఆర్ఎస్ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉనికి చాటుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్-వామపక్షాలు కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించాయి. వైఎస్ సీఎం అయ్యారు.
-2009 ఎన్నికల నాటికి టీఆర్ఎస్, వామపక్షాలను చంద్రబాబు తనవైపు తిప్పుకొన్నా, మధ్యలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వచ్చినా, వైఎస్ గెలుపును ఆపలేకపోయారు. 2009 సెప్టెంబరు 2న చనిపోయే వరకు వైఎస్ ఎరా నడిచింది. వైఎస్ మరణించాక ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంత పార్టీ వైఎస్సార్ సీపీని స్థాపించారు.
-వైఎస్ చనిపోయాక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి 2014 నాటికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్, విభజిత ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ గెలిచాయి. అంటే, ఉమ్మడి ఏపీలో 2004తోనే టీడీపీ అధికారం క్లోజ్ అయింది.
-ఇదీ.. 2000 ఆగస్టు 28కి ఉన్న చరిత్ర. నాడు బషీర్ బాగ్ కాల్పుల అనంతరం విద్యుత్ ఉద్యమం చల్లబడింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రెండో దశ విద్యుత్ సంస్కరణల అమలును కూడా ఆపివేసింది. కానీ, చరిత్రను మాత్రం నిలువరించలేకపోయింది.