మళ్ళీ సర్ స్టార్ట్ ....ఈసీ సంచలన నిర్ణయం

దేశమంతా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ని త్వరలో నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.;

Update: 2026-05-12 03:46 GMT

దేశమంతా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ని త్వరలో నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా సర్ ని వాయిదా వేశామని ఈసీ పేర్కొంది. సర్ ప్రక్రియ పెద్ద ఎత్తున త్వరలో మొదలవుతుందని ఈసీ ప్రకటించడం విశేషం. ఇక దేశంలో ఉన్న మొత్తం 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల మందికి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ పూర్తి అయిందని వివరించింది. ఇక మిగిలింది 40 కోట్ల ఓటర్లు అని రానున్న రోజులో సర్ ప్రక్రియ వేగంగా సాగుతుందని దాంతో దేశంలో మొత్తం ఓటర్ల జాబితా సవరణ పర్వం పరిపూర్తి అవుతుందని వివరించింది.

మూడవ దశగా :

దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మూడవ దశ ఏకంగా 17 రాష్ట్రాలతో పాటు అయిదు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక ఇప్పటిదాకా సర్ ప్రక్రియను ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబర్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, బీహార్ రాష్ట్రాలలో చేపట్టడం జరిగిందని ఈసీ పేర్కొంది. అదే విధంగా తాజాగా ఎన్నికలు పూర్తి చేసుకున్న అసోంలోనూ ప్రత్యేక సవరణ కార్యక్రమం జరిగిందని తెలిపింది. ఇవి కాకుండా మిగిలిన రాష్ట్రాలలో సర్ కి రంగం సిద్ధం చేశామని వెల్లడించింది.

రాష్ట్రాలకు ఈసీ లేఖలు :

ఇక దేశంలో మిగిలిన 17 రాష్ట్రాలలో సర్ ప్రక్రియ జరిపీంచేందుకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. అతి తొందరలోనే సర్ ప్రక్రియ చేపట్టి దేశం మొత్తం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు సవరించేందుకు ఈసీ సిద్ధపడుతోంది. ఇదిలా ఉంటే మిగిలిన రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దాంతో ఇక్కడ సర్ ప్రక్రియ ఎలా సాగుతుంది అన్నదే ఆసక్తిని పెంచుతున్న అంశంగా ఉంది.

కాంగ్రెస్ వైసీపీ రెండూ :

తెలంగాణాలో సర్ మీద ఇప్పటికే కాంగ్రెస్ అప్రమత్తంగా ఉంది. ఏ ఒక్క ఓటూ పోవడానికి వీలు లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సర్ తో ఓట్లు తొలగిస్తామంటే ఊరుకోమని చెబుతున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ ఈసరికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రతీ బూత్ లెవెల్ ఓటర్ల వివరాలు తమకు ఇవ్వాలని కోరింది. సర్ ప్రక్రియకు తాము అనుకూలం అంటూనే అనర్హుల ఓట్లను తొలగించాలని అర్హుల ఓట్లు మాత్రం ఏ ఒక్కటీ పోవడానికి వీలు లేదని వైసీపీ గట్టిగా చెబుతోంది. దాంతో ఏపీలో తెలంగాణాలో సర్ ప్రక్రియ రాజకీయంగా ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News