సగం భారతంలో సర్...ఈసీ కీలక అడుగు
బీహార్ లో చేపట్టిన సర్ సూపర్ సక్సెస్ అయింది అని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అంటున్నారు.;
సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని దాదాపుగా సగం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ని నిర్వహించేందుకు ముహూర్తం రెడీ చేసి ప్రకటించింది. ఇది దేశంలో రెండవ దశగా ఈసీ అంటోంది. తొలి దశ బీహార్ తో మొదలెట్టినట్లుగా చెబుతోంది. దేశంలో రెండవ దశలో 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌ను చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.
సర్ సక్సెస్ :
బీహార్ లో చేపట్టిన సర్ సూపర్ సక్సెస్ అయింది అని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అంటున్నారు. తొలిదశలో బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను విజయవంతంగా పూర్తి చేసామని ప్రజలు అక్కడ పూర్తిగా సహకరించారని ఆయన అంటున్నారు. దాంతో తాజాగా రెండవ దశను చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక ఈ రెండవ దశలో అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్ లలో ఎస్‌ఐఆర్‌ను చేపడతామని అన్నారు. ఈసారి నిర్వహించే ఈ ప్రక్రియలో 51 కోట్లమంది ఓటర్లు భాగం కానున్నారు. ఇక నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది, ఆదే విధంగా ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 9న ప్రకటిస్తారు తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తారు.
ఇప్పటికి ఎనిమిది సార్లు :
దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడం గతంలో చాలా సార్లు జరిగింది అని ఈసీ అంటోంది. 1951 నుంచి ఈ సవరణను ఎనిమిది సార్లు నిర్వహించామని, 2002-2004లో చివరిసారి ఈ ప్రక్రియ జరిగిందని ఈసీ అంటోది. ఇదిలా ఉండగా ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా కచ్చితత్వాన్ని నిర్ధారించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమని ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ చెబుతున్నారు. దీని మీద ఎవరికీ ఎలాంటి అపోహలకు తావు లేదని ఈసీ చెబుతోంది. ఈ పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో బూత్ లెవల్ అధికారులు ఇప్పటికే ఉన్న ఓటర్లకు ప్రత్యేకమైన గణన ఫారమ్‌లను పంపిణీ చేయడానికి ఈసీ రంగం సిద్ధం చేసింది. 2003 ఓటరు జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లు అదనపు పత్రాలను అందించాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.
ఓట్ల చోరీ అంటూ :
ఇదిలా ఉంటే బీహార్ లో సర్ ని అమలు చేస్తే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించి. ఇపుడు రెండవ దశను ఈసీ ప్రకటించింది. దాంతో మరోసారి ఇది రాజకీయ రచ్చకు దారి తీస్తుందా అన్నది ఆలోచిస్తున్నారు. నిజానికి ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ చేపట్టే ఏ చర్యలకు అయినా రాజకీయ పార్టీలు సహకారం అందించాలి. కానీ ఎందుకో ఈసీ మీదకే రాజకీయ పార్టీలు యుద్ధం ప్రకటిస్తున్నాయి. పైగా వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో ఎన్నికలు ఉన్నాయి. రెండవ దశ సర్ ప్రక్రియ అక్కడ కూడా జరుగుతోంది. మరి స్టాలిన్, మమతా బెనర్జీ ఏ విధంగా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది.