ఎల్ నినో తో తెలుగు సీఎంలు తప్పించుకుంటున్నారా ?
నిజానికి ఎల్ నినో ప్రభావం గట్టిగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు లేవు, దాంతో కూరగాయల దగ్గర నుంచి అన్నింటికీ కరవు వచ్చి పడుతోంది.
ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ప్రజలు అల్లాడుతున్నారు. విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అలాగే ఆహార ద్రవ్యోల్బణం కూడా అధికంగానే ఉంది. ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. మధ్యతరగతి పేదలు ఎక్కువగా దీని వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా నెలవారీ బడ్జెట్ పెరిగిపోయింది. ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నా ఖర్చులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఎలా వీటిని అధిగమించాలని జనాలు సతమతమవుతూంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ పాపం అంతా ఎల్ నినో అని నెట్టేస్తున్నారు. ఎల్ నినో వల్లనే సకల సమస్యలు వచ్చినట్లుగా చెప్పి తప్పించుకుంటున్నారు అన్న చర్చ సాగుతోంది.
కరవుతో కష్టాలు :
నిజానికి ఎల్ నినో ప్రభావం గట్టిగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు లేవు, దాంతో కూరగాయల దగ్గర నుంచి అన్నింటికీ కరవు వచ్చి పడుతోంది. దాంతో సంచిలో రూపాయలు పట్టుకుని బజారుకు వెళ్తే జేబుకి సరిపడా సరుకులు వస్తున్నాయని వాపోతున్నారు. ఇక విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో మధ్యతరగతి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు, వారు పైకి పోలేరు, అలాగని దిగువకు రాలేరు, దాంతో ఏమీ కొనలేని విధంగా వారి అవస్థలు ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ప్రతీ దానినీ ఎల్ నినోకు అంటగడుతున్నారు. మాటకు వస్తే చాలు ఎల్ నినో ప్రభావం అని చెబుతూన్నారు. అయితే అసలు సమస్యలు ఏమిటి అన్నది జనాలకు తెలుసు అని అంటున్నారు. ప్రభుత్వాలు ప్రజల కష్టాలను తీర్చే మార్గం చూడాలి కానీ ఇలా తప్పించుకోవడం సబబా అన్న చర్చ అయితే రెండు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సాగుతోంది.
కరోనా కంటే పెద్దదా :
ఇక ఒక్కసారి అయిదేళ్ళ క్రితం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే కరోనాతో ఏకంగా ప్రపంచమే స్థంభించిపోయింది. ప్రభుత్వాలకు రాబడి అన్నదే లేకుండా పోయింది. ఎవరిని అడగాలని అనుకున్నా అందరిదీ అదే పరిస్థితి. అయినా ఆనాడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన కేసీఅర్ జగన్ సామాన్యులు, మధ్య తరగతి ప్రజల కష్టాలను పట్టించుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. కరోనా వచ్చినపుడు ధరలు పెరిగినా కూడా వాటిని బాలెన్స్ చేసేలా జనాలకు ఊరట ఇచ్చేలా ఆర్ధికంగా బాసటగా నిలిచిన ఉదంతాలు ఉన్నాయని అంటున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఇంటికీ ఆ రోజుల్లో ఆర్ధిక సాయం వైసీపీ ప్రభుత్వం చేసింది. కేసీఆర్ కూడా సగటు జనం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. అంతే తప్ప నాటి ఇద్దరు సీఎంలు ఎలాంటి సాకులూ వెతకలేదని అంటున్నారు. కరోనా కంటే పెద్ద కష్టమేదీ ఇపుడు లేదు కదా అని అంటున్నారు. ఆనాడు కేసీఅర్ జగన్ లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ఏమీ లేదని అంటున్నారు. అయినా వారి శక్తి మేరకు వారు చేసి చూపించారు అని అంటున్నారు.
బాబుకు అడ్వాంటేజ్ ఉంది :
ఇక ఏపీ సీఎం చంద్రబాబు అయితే ఇపుడు అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు అని అంటున్నారు. కేంద్రంలో నడిచే మోడీ ప్రభుత్వానికి ప్రాణ వాయువు మాదిరిగా ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దతు ఉంది. అందువల్ల కరవుతో ఏపీ జనాలు అల్లల్లాడుతున్న వేళ కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం అందుకుని ప్రజలను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత సీనియర్ నేతగా బాబు మీద ఉంది అని అంటున్నరు. పేదలు మధ్యతరగతి వర్గాలు కరవు కోరలలో చిక్కి నానా రకాలుగా అవస్థలు పడుతున్న వేళ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి దండీగా నిధులు సాధించి వారిని ఆదుకోవాలి కదా అని అంటున్నారు. సాకులు చెబుతూ కాలక్షేపం చేయడం సబబేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఎవరు ఊహిస్తారు :
ప్రకృతిలో ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరు ఊహిస్తారు అని అంటున్నారు. ఏదో ఒక సమస్య ప్రకృతి నుంచి ఉండడం సర్వ సాధారణం అని కూడా గుర్తు చేస్తున్నారు. అంతే కాదు యుద్ధాలు వస్తాయని అంతర్జాతీయంగా పరిస్థితులు మారుతాయని కూడా ఎవరూ అనుకోరు కదా అంటున్నారు మేధావి వర్గాలు. ఆ మాటకు వస్తే కరోనా వస్తుందని ఎవరైనా కల గన్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇలాంటి ఇబ్బందులు ప్రకృతి విపత్తులు వచ్చినపుడే సమర్ధంగా ప్రభుత్వాలు స్పందించాలని మేమున్నామని అండగా సగటు జనాలకు నిలబడాలని అంటున్నారు. వర్షాభావ పరిస్థితులలో జనాలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని కూడా అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు లాంటి సీనియర్ కి కొత్తగా వేరేగా చెప్పేది కూడా ఏమి ఉంటుందని అంటున్నారు. అలాంటి చంద్రబాబు కరవు ఉంది, ఎల్ నినో ఉందని అంటూంటే ఎలా సారూ అన్నదే మేధావి వర్గం నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా కరవు కోరలలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు బాబు వంటి వారు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.