ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్.. ఏం జరుగనుంది?

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.;

Update: 2025-07-30 05:55 GMT

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు పది రోజుల క్రితమే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం ప్రకాష్ రాజ్‌ తన లాయర్‌తో కలిసి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

-29 మంది ప్రముఖులపై విచారణ

బెట్టింగ్ యాప్‌ల కేసులో మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్లు హర్ష సాయి, బయ్య సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని వంటి వారు ఉన్నారు.

-వివాదాస్పద ప్రమోషన్లు

ఈ కేసులో ప్రధాన అంశం.. జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365 వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ఈ సెలబ్రిటీలు చేసిన ప్రమోషన్లు. ఈ ప్రచారాల వల్ల అనేక మంది యువత డబ్బులు పోగొట్టుకుని మోసపోయారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా యాప్ నిర్వాహకులు హవాలా మార్గంలో ఈ సెలబ్రిటీలకు డబ్బులు చెల్లించినట్లు కూడా విచారణలో వెల్లడవుతోంది.

-ఈడీ దర్యాప్తు వేగవంతం

ఈడీ ఇప్పటికే తెలంగాణ పోలీసుల నుంచి పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన కేసుల వివరాలను సేకరించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసులు నమోదు చేసి, ఈసీఐఆర్ (ECIR) ఆధారంగా విచారణను ముమ్మరం చేసింది. ఇతర ప్రముఖులకు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. రానా దగ్గుబాటిని ఆగస్టు 11న హాజరు కావాలని.. విజయ్ దేవరకొండను ఆగస్టు 6 ను హాజరు కావాలని.. మంచు లక్ష్మి ఆగస్టు 13న రావాలని నోటీసులు అందించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలు, వాటికి సినీ సెలబ్రిటీల ప్రమోషన్ల వ్యవహారంపై ఈడీ తీవ్రంగా దృష్టి సారించింది. ఈ కేసు డిజిటల్ ప్రవర్తనలకు మార్గదర్శకాలు, ప్రమోషనల్ ప్రకటనలపై నియంత్రణ అవసరమనే చర్చకు దారితీస్తోంది. విచారణ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, ఇందులో ఇంకా అనేక కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Full View
Tags:    

Similar News