పెను విషాదం... ప్రార్థనలు చేస్తూనే 700 మంది సజీవ సమాధి!

గతవారం మయన్మార్, థాయిలాండ్ లలో వరుసగా సంభవించిన భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.;

Update: 2025-03-31 10:23 GMT

గతవారం మయన్మార్, థాయిలాండ్ లలో వరుసగా సంభవించిన భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకంపనల ధాటికి మయన్మార్ లో భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది. ఈ క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా తాజాగా పెను విషాదానికి సంబంధించి షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... రంజాన్ శుక్రవారం వేళ ముస్లింలు ప్రార్థనలు చెస్తుండగా ఓ ఘోర విపత్తు చోటుచేసుకోవడంతో.. దేశవ్యాప్తంగా 700 మంది శిథిలాల కింద సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. గతవారం సంభవించిన భూకంపం కారణంగా వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమవ్వగా.. ఈ ప్రకంపనల ధాటికి 60 మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని చెబుతున్నారు.

ఈ మేరకు స్ప్రింగ్ రివల్యూషన్ మయన్మార్ ముస్లిం నెట్ వర్క్ కమిటీ సభ్యుడు టున్ కీ వెల్లడించారు. సరిగ్గా మధాహ్నం ప్రార్థనలు చేస్తుండగా.. ఈ విపత్తు రావడంతో శిథిలాల కిందే సుమారు 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన టున్ కీ తెలిపారు.

ఇక... ఈ భూవిలయం కారణంగా మయన్మార్ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఈ విపత్తు వల్ల ఇప్పటికే 1700 పైగా మరణించినట్లు మిలటరీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇదే సమయంలో.. మరొ 3400 మంది గాయపడ్డారని.. ఇంకో 300 మందికిపైగా గల్లంతయ్యారని.. వారు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. ఇప్పటికే అంతర్యుద్ధంతో కకావికలమైన మయన్మార్ ను ఈ భూవిలయం మరింత కుదిపేసింది. ప్రకంపనల కారణంగా మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్ళిపోతున్నాయని.. అందువల్ల దుర్గంధం వెలువడుతోందని చెబుతున్నారు.

కాగా.. బ్యాంకాక్, మయన్మార్ లను గత శుక్రవారం వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. మయన్మార్ లో 12 నిమిషాల వ్యవధిలో రెండు వరుస భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భారీ భూకంపాల తీవ్ర 7.7గా నమోదైంది. ఇదే సమయంలో.. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 6.4, 7.3 తీవ్రత్రతతో రెండు వరుస భూకంపాలు సంభవించి ఘోర నష్టాన్ని కలిగించాయి.

Tags:    

Similar News