55 డిగ్రీల సెల్సియస్ దాటితే మనిషి ఏమవుతాడు ?

సాధారణంగా మనిషి తట్టుకునే విధంగా ఉండే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ లోపు మాత్రమే. అది దాటితే ఇబ్బంది అవుతుంది. అయితే ప్రస్తుతం అది కాస్తా 50 డిగ్రీల దాకా పెరుగుతోంది.

Update: 2026-05-25 15:00 GMT

ఈ భూమి మీద మనిషి మనుగడ ఇక మీదట కష్టం అవుతుందా. మానవాళికి పెను ముప్పు ప్రకృతి నుంచే పొంచి ఉందా అంటే దీనిని జవాబు కూడా భయంకరంగా ఉంది. నానాటికీ ఈ భూమి హీటెక్కిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే వికృత చేష్టలు ఈ భూమిని సైతం లేకుండా చేసేలా ఉన్నాయి. ఈ రోజున ప్రపంచం అంతా అక్కడా ఇక్కడా తేడా లేకుండా మండిపోతోంది. చలి దేశాలలోనూ వేడి వాతావరణం కనిపిస్తోంది. దీనిని కారణం ప్రకృతిని పరిరక్షించకపోవడమే. ఈ రోజుకు చూస్తే భారత్ దేశంలో దాదాపుగా 50 డిగ్రీల సెల్సియస్ కి గరిష్ట ఉష్ణోగ్రతలు చేరువ అవుతున్నాయి. ఇవి కాస్తా మరో అయిదారు డిగ్రీలు పెరగడానికి ఎంతో కాలం పట్టదు. తొందరలోనే అది జరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే మనిషి సంగతి ఏమిటి అన్నదే అతి పెద్ద ప్రశ్న.

మానవ ప్రాణానికే ముప్పు :

సాధారణంగా మనిషి తట్టుకునే విధంగా ఉండే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ లోపు మాత్రమే. అది దాటితే ఇబ్బంది అవుతుంది. అయితే ప్రస్తుతం అది కాస్తా 50 డిగ్రీల దాకా పెరుగుతోంది. అయినా సరే ఏసీలతో సర్దుకుంటూ కృత్రిమంగా లభించే చల్లదనంతో మనిషి మనుగడ సాగిస్తున్నాడు. అయితే గ్రీన్ హౌస్ వాయువులు ప్రకృతితో కలసి మరింత వేడిని పుట్టిస్తున్నాయి. అంటే ఏసీల వల్ల తాత్కాలిక చల్లదనం లభిస్తున్నా అది వాతావరణాన్ని ఇంకా మండిస్తుంది అన్న మాట. మరో వైపు చూస్తే ఈ ఉష్ణోగ్రతలు కాస్తా మరింతగా పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి కాస్తా 55 డిగ్రీల సెల్సియస్ ని దాటేస్తే కనుక మానవ ప్రాణానికి తీవ్రమైన ప్రమాదం ఉంది అని అంటున్నారు.

దారుణమైన ఫలితాలు :

మనిషి శరీరం ఇంతటి పరిసరాల అధిక వేడిని అసలు తట్టుకోలేదు. దాంతో ప్రాణాంతకమైన వడదెబ్బతో అయినా లేదా అవయవ వైఫల్యం అయినా సంభవించడానికి ముందు ప్రాణాలతో ఉండే సమయం సాధారణంగా కొన్ని నిమిషాలకు పరిమితం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అధిక ఉష్ణోగ్రతల వద్ద పరిసరాలు సాధారణ మానవ చర్మం కంటే వేడిగా ఉంటాయి. శరీరం పరిసరాల నుండి వేగంగా వేడిని గ్రహిస్తుంది దాంతో శరీర అంతర్గత ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరగడం మొదలవుతుంది. మానవ శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత దేహంలోని కేంద్ర నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది, దాంతో తీవ్రమైన నిర్జలీకరణం చెందుతుంది. ఈ క్రమంలో శరీరాన్ని చల్లబరచుకోవడానికి అది చమటను ఉత్పత్తి చేస్తుంది. అయితే 55 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతల వద్ద చమట సైతం తక్షణమే ఆవిరైపోతుంది. దాంతో తీవ్రమైన వేగవంతమైన నిర్జలీకరణం సంభవిస్తుంది.

శరీర విచ్చితికి :

ఆ మీదట శరీరంలో ప్రతీ గంటకు 1-2 లీటర్ల వరకు నీటి నష్టం జరగవచ్చు అని చెబుతున్నారు. ఇది కాస్తా హైపోవోలెమిక్ షాక్‌కు దారితీస్తుంది. అలా హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. శరీరాన్ని చల్లబరచడానికి చర్మంలోకి అత్యవసరంగా రక్తాన్ని పంప్ చేయడం వల్ల హృదయ స్పందన రేటు 60 శాతం ఎక్కువగా పెరగవచ్చు, దీనివల్ల గుండె కండరాలపై అధిక భారం పడుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు దీనికి గురికావడం వల్ల ప్రోటీన్లు వికృతీకరణకు గురవుతాయి. శరీర అంతర్గత ఉష్ణోగ్రతలు వంద డిగ్రీల సెల్సియస్ కి చేరినప్పుడు, అవయవాలు పనిచేయడం పూర్తిగా ఆగిపోతాయి, దీని ఫలితంగా మెదడు దెబ్బతినడం హృదయ-శ్వాసకోశ వ్యవస్థ కుప్పకూలడం జరుగుతుంది అని అంటున్నారు.

కౌంట్ డౌన్ స్టార్ట్ :

ఇప్పటికే 50 డిగ్రీల సెల్సియస్ కి చేరువ అవుతున్న ఉష్ణోగ్రతలు పెరగడానికే మానవాళి మొత్తం పనిచేస్తోంది. ఎక్కడ చూసినా చెట్లు పోయి కాంక్రీట్ జంగిల్స్ వచ్చేశాయి. అభివృద్ధి పేరుతో పంట పొలాలను సైతం అమ్మేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో కొత్తగా కట్టిన చోట్ల ఎక్కడా ఒక్క మొక్క కూడా ఉండడం లేదు. అందుకే ఇప్పటికైనా మించిపోయినది లేదు ఎయిర్ కండిషన్ వద్ద రెస్ట్ తీసుకోవడం పక్కన పెట్టి ప్రతీ వారూ మొక్కలను పెంచాలని వాతావరణ నిపుణులు కోరుతున్నారు అలా చేస్తే కనుక ఒక మొక్క కనీసంగా ఏడేళ్ల వ్యవధిలో విశాలమైన చెట్టుగా మారి నీడతో పాటు ప్రాణ వాయువుని ఇస్తూ వాతావరణాన్ని చల్ల బరుస్తుంది. ఈ రోజున చూస్తే భారత దేశం మొత్తానికి 500 కోట్ల చెట్లు అవసరం ఉంది. అని లెక్క తేలుస్తున్నారు. తలచుకుంటే ఏమంత కష్టం కాదు, 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంతా తలచుకుంటే ప్రతిన పూనితే మొక్కల పెంపకం ఉద్యమం అవుతుంది. అందుకే మొక్కలను పెంచడం ఈ రోజు నుంచే మొదలెట్టాలి. లేకపోతే ఈ భూమి మండిపోతుంది, మనిషితో పాటు జీవరాశి కూడా అంతమయ్యే కాలం ఎంతో దూరం లేదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News