తమిళనాడు ఎన్నికల్లో డాక్టర్ కం వ్యాపారి రికార్డు స్థాయి నామినేషన్
సేలం జిల్లా మెట్టూరుకు చెందిన ఆయన తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి మరోసారి దిగుతున్నారు.;
గెలవటం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారు.కానీ.. ఈ డాక్టర్ కం వ్యాపారి మాత్రం అందుకు భిన్నం. సామాన్యుడు సైతం ఎన్నికల్లో పోటీ చేయటం సులువైన పని అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయటం కోసం ఆయన ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తారు. పంచాయితీ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఆయన పోటీ చేయని ఎన్నికలే ఉండవు. అత్యధిక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రికార్డును సగర్వంగా అందుకు వ్యక్తిగా ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోనే కాదు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ నమోదైంది. ఇంతకూ ఆయన ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం.. తమిళనాడుకు చెందిన డాక్టర్ కె.పద్మరాజన్.
సేలం జిల్లా మెట్టూరుకు చెందిన ఆయన తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి మరోసారి దిగుతున్నారు. తాజాగా మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. సోమవారం ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. వేర్వేరు ఎన్నికల్లో నామినేషన్లు వేసిన ఆయన.. తాజాగా వేసిన నామినేషన్ తో 253 సార్లు నామినేషన్ వేసినట్లైంది. హోమియోపతి డాక్టర్ అయిన పద్మరాజన్ టైర్ల రీట్రేడింగ్ వ్యాపారి కూడా.
తొలసారి 1988లో మెట్టూరు నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఎన్నికలు ఏవైనా.. ఆయన బరిలోకి దిగుతారు. పంచాయితీ ఎన్నికల నుంచి లోక్ సభ ఎన్నికల వరకు అన్నింట్లోనూ ఆయన పోటీ చేస్తూనే ఉంటారు. అంతేకాదు.. సాధారణ అభ్యర్థుల మీదే కాదు..దేశంలోని అగ్రనేతలపైనా పోటీకి దిగిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. గతంలో వాజ్ పేయ్, పీవీ నరసింహరావు.. మోడీ.. రాహుల్ గాంధీ.. జయలలిత.. కరుణానిధి లాంటి దిగ్గజ నేతల పైనా ఆయన పోటీ చేశారు.
అంతేనా.. ఇప్పటివరకు ఆరుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ.. ఏడుసార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్ వేసిన ఘన చరిత్ర ఆయన సొంతం. అయితే.. తాను ఎన్నికల్లో పోటీ చేసేది గెలుపు కోసం కాదని.. సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చన్న విషయాన్ని చాటిచెప్పేందుకే తాను ఇలా చేస్తానని.. చెప్పారు. కొసమెరుపుఏమంటే. ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా తాను బరిలో దిగిన ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకున్నది లేదు.