వైట్‌హౌస్ టు వైర్లెస్: మైక్ విసిరేసి "థాంక్యూ డార్లింగ్" అన్న ట్రంప్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!

మొత్తానికి వైట్‌హౌస్ రేస్ ముగిసినా ట్రంప్ ఇచ్చే ఎంటర్టైన్‌మెంట్‌కు మాత్రం ఎండ్ కార్డ్ పడటం లేదు.

Update: 2026-06-08 06:50 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక అన్‌ప్రెడిక్టబుల్ ప్యాకేజీ. ఆయన ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో.. ఎప్పుడు ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారో ప్రెసిడెంట్ గారి ‘మూడ్ స్వింగ్స్’ కనిపెట్టే సాఫ్ట్‌వేర్ ఇంకా సిలికాన్ వ్యాలీలో కూడా తయారవ్వలేదు. అందుకే వైట్‌హౌస్ వర్గాల్లో ఆయన్ను ఒక ‘లైవ్ వైర్’ లాగా చూస్తుంటారు. టచ్ చేస్తే చాలు.. షాక్ కొట్టడం ఖాయం. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రదర్శించిన విశ్వరూపం చూశాక ఇప్పుడు అమెరికన్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

కథేంటంటే.. ప్రెసిడెంట్ గారికి ప్రెజర్ పెరిగింది!

ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ ‘ఎన్‌బీసీ’ ప్రతినిధి క్రిస్టెన్ వెల్కర్ ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో భాగంగా ట్రంప్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నారు. అంతా బాగానే సాగుతోంది అనుకునేలోపు చర్చ కాలిఫోర్నియా ఎన్నికల వైపు మళ్లింది. ఇంకేముంది.. అక్కడ భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ తనదైన శైలిలో ఆరోపణల సునామీ మొదలుపెట్టారు. సరే జర్నలిస్ట్ అన్నాక కనీస ధర్మం పాటించాలి కదా.. "అంత పెద్ద మాట అంటున్నారు.. ఏమైనా ఆధారాలు ఉన్నాయా సార్?" అని క్రిస్టెన్ చాలా మర్యాదగా అడిగారు. ఇక్కడే ట్రంప్ సహనానికి ‘టోల్ గేట్’ పడిపోయింది. ఒకసారి అడిగితే ఓపిక పట్టారు.. కానీ సదరు యాంకర్ వదలకుండా పదేపదే "ప్రూఫ్స్ ఏవి? ప్రూఫ్స్ ఏవి?" అని అడిగేసరికి.. ట్రంప్ ముఖంలో ఉన్న కాస్త నవ్వు మాయమై, హాలీవుడ్ విలన్ రేంజ్ ఆగ్రహం ఎంట్రీ ఇచ్చింది.

మైక్ నేలకు.. ‘డార్లింగ్’ గాల్లోకి!

"నువ్వు పనికిమాలిన వ్యక్తివి.. మీ మీడియా మొత్తం అవినీతిమయం.. ఈ మీట్ ది ప్రెస్ అనేది ఒక మోసపూరిత షో!" అంటూ ట్రంప్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అంతటితో ఆగితే ఆయన ట్రంప్ ఎందుకు అవుతారు? చేతిలో ఉన్న మైక్‌ను తీసి ‘ఛటాల్న’ నేలకేసి కొట్టారు. ఆ దెబ్బకు అక్కడ ఉన్నవారంతా గుండె ఆగినంత పనిచేశారు. అయితే అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అంత ఘోరంగా మైక్ విసిరేసి వెళ్లబోతూ యాంకర్‌ వైపు చూసి చాలా కూల్‌గా "ఇక ఇక్కడితో ఆపేద్దాం... థాంక్యూ డార్లింగ్!" అంటూ ఫ్లయింగ్ కిస్ రేంజ్‌లో సైన్ ఇచ్చి అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఇప్పుడు అమెరికా జనాభా అంతా ఇదే కన్‌ఫ్యూజన్‌లో ఉంది. మైక్ విసిరేయడం కోపానికి పరాకాష్ట అయితే.. ‘థాంక్యూ డార్లింగ్’ అనడం దేనికి సంకేతం? ఇది కోపమా, ప్రేమా లేక ట్రంప్ మార్కు ‘స్పెషల్ ప్యాకేజీ’నా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం.. మైక్ కంపెనీల పండగ!

ఈ ఘటనపై విమర్శకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. "ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన ట్రంప్.. ఇప్పుడు అధ్యక్ష పీఠం ఎక్కాక ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మానేసి, ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తున్నారు" అంటూ మండిపడుతున్నారు. కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం ఈ ఇష్యూని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న కొన్ని క్రేజీ కామెంట్లు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపై ట్రంప్ ఇంటర్వ్యూలు బుక్ చేసుకునే టీవీ ఛానళ్లు.. ముందుగా తమ మైక్‌లకు, కెమెరాలకు ‘ట్రంప్ స్పెషల్ ఇన్సూరెన్స్’ చేయించుకోవడం ఉత్తమం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మార్కెట్లోకి కొత్తగా "నోకియా 3310" లాంటి ఒక మైక్ మోడల్‌ను తీసుకురావాలని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయట. "అమెరికా ప్రెసిడెంట్ చేతిలో పడినా పగలని ఏకైక మైక్!" అంటూ వాళ్లూ ప్రమోట్ చేసుకోవచ్చు. "ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయడం అంటే.. ప్రాణాలకు మాత్రమే కాదు.. ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా తీవ్రమైన రిస్క్ అని తేలిపోయింది!" నెటిజన్ల పంచ్ లు వేస్తున్నారు.

మొత్తానికి వైట్‌హౌస్ రేస్ ముగిసినా ట్రంప్ ఇచ్చే ఎంటర్టైన్‌మెంట్‌కు మాత్రం ఎండ్ కార్డ్ పడటం లేదు. ‘థాంక్యూ డార్లింగ్’ అనే డైలాగ్ ఇప్పుడు గ్లోబల్ ట్రెండింగ్ మీమ్ మెటీరియల్‌గా మారిపోయింది!

Tags:    

Similar News