బలికి సిద్ధమైన ట్రంప్ బఫెలో.. చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్!
బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన ఓ ఫారంలో ఈ అరుదైన ఆల్బినో వైట్ గేదె పెరుగుతోంది. దీని బరువు దాదాపు 700 కిలోలు.
అమెరికా అద్యక్షుడిని పోలి ఉందంటూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఓ అరుదైన తెల్లగేదె ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కు ఈద్ సందర్భంగా బలి తప్పదనుకున్న వేళ… చివరి క్షణంలో కథ ఊహించని మలుపు తిరిగింది. బలి పీఠం దాకా వెళ్లిన ఈ సెలబ్రిటీ గేదె ప్రాణాలను కాపాడటానికి స్వయంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఈ క్రేజీ అండ్ హ్యాపీ ఎండింగ్ స్టోరీ విశేషాలు మీకోసం...
డొనాల్డ్ ట్రంప్‌లాగే హెయిర్‌స్టైల్:
బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన ఓ ఫారంలో ఈ అరుదైన ఆల్బినో వైట్ గేదె పెరుగుతోంది. దీని బరువు దాదాపు 700 కిలోలు. దీని నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు చూడటానికి అచ్చు గుద్దినట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెయిర్‌స్టైల్‌ను పోలి ఉంటుంది. ఇక అందుకే దీనికి ముద్దుగా “ట్రంప్” అని పేరు పెట్టారు. ఇంకేముంది, దీని లుక్ చూసి జనాలు ఫ్లాట్ అయిపోయారు. ఫారానికి క్యూ కట్టి మరీ సెల్ఫీలు దిగడం స్టార్ట్ చేశారు.
బలి ఇవ్వాలని డిసైడ్ చేశారు కానీ:
బక్రీద్ పండుగ వస్తుండటంతో, త్యాగంలో భాగంగా ఈ గేదెను బలి ఇవ్వడానికి ఓ వ్యక్తికి అమ్మేశారు. "ట్రంప్ బఫెలోను చాలా మిస్ అవుతాం.. కానీ పండుగ స్ఫూర్తి ముఖ్యం కదా" అని యజమాని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఫీలయ్యారు. ఇక ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన ఈ గేదె కథ విషాదంగా ముగిసిపోతుందని అందరూ బాధపడ్డారు.
చివరి క్షణంలో హోం మంత్రి ఎంట్రీ:
ఇక్కడే అసలైన ట్విస్ట్ పడింది! సోషల్‌మీడియాలో వస్తున్న కామెంట్లు, ఈ గేదెకు ఉన్న క్రేజ్ చూసి బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ అలర్ట్ అయింది. ఇంత అరుదైన జంతువును బలి ఇవ్వకూడదని భావించి, చివరి నిమిషంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక గేదెను కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు లేదా మరో జంతువును బదులుగా ఇస్తామని చెప్పి, ఈ ‘ట్రంప్’ ప్రాణాలను కాపాడారు.
ఇప్పుడు జూలో వీఐపీ ట్రీట్‌మెంట్:
ప్రస్తుతం ఈ ‘ట్రంప్ బఫెలో’ను సేఫ్‌గా ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. అక్కడ దీని కోసం ఒక ప్రత్యేక షెడ్, స్పెషల్ కేర్‌టేకర్‌ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. రెండు వారాల పాటు దీనికి క్వారంటైన్ పూర్తి అయ్యాక, జూకి వచ్చే సందర్శకులకు అందుబాటులోకి ఉంచుతారు.
శరీరంలో మెలానిన్ లోపం వల్ల ఇలాంటి ఆల్బినో గేదెలు పుడతాయని, ఇవి బంగ్లాదేశ్‌లో చాలా అరుదని పశువైద్యులు చెప్తున్నారు.ఇక ఏదేమైనా, డొనాల్డ్ ట్రంప్ లుక్ ఉండటం వల్లే ఈ గేదె ప్రాణాలు దక్కాయంటూ నెటిజన్లు ఇప్పుడు తెగ ముచ్చటించుకుంటున్నారు. ఇక చనిపోవాల్సిన గేదె కాస్తా.. ఇప్పుడు జూలో సెలబ్రిటీగా మారి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయబోతోంది.