ఆకలి వేస్తోందని దోశె కోసం సర్జరీ ఆపేసిన డాక్టర్

ఆకలిగా ఉందంటూ చేస్తున్న సర్జరీని అలానే వదిలేసి.. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి.. మసాల దోశె తినేందుకు వెళ్లిన వైద్యుడి వ్యవహారం షాకింగ్ గా మారింది.

Update: 2024-04-28 08:17 GMT

చదివినంతనే షాక్ తినే ఉదంతంగా దీన్ని చెప్పాలి. సీరియస్ గా సర్జరీ సాగుతున్న వేళ.. చిన్నపాటి డిస్ట్రబెన్సుకు ఇష్టపడరు వైద్యులు ఎవరైనా. కానీ.. ఇప్పుడు చెప్పే డాక్టర్ కాస్త తేడా కేస్. ఇతగాడి లీలల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఆకలిగా ఉందంటూ చేస్తున్న సర్జరీని అలానే వదిలేసి.. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి.. మసాల దోశె తినేందుకు వెళ్లిన వైద్యుడి వ్యవహారం షాకింగ్ గా మారింది. ఇంతకూ ఈ డాక్టర్ ఎక్కడి వాడు? ఏం చేస్తుంటాడు? అన్న విషయాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘనకార్యం జరిగినట్లు చెబుతున్నారు.

ఝూన్సీ జిల్లాలోని నవాబాద్ ప్రాంతానికి చెందిన కాజల్ శర్మ అనే బాలిక ఇంట్లో ప్రమాదవశాత్తు పడిపోయింది. వెంటనే ఆమెను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు వెంటనే సర్జరీ చేయాలని చెప్పాడు.

అందుకు తగ్గట్లే షెడ్యూల్ సిద్ధం చేశారు. గత ఏడాది డిసెంబరు 22న ఆ బాలికకు సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్ కు వెళ్లిన వైద్యుడు.. ఆపరేషన్ మధ్యలో తనకు ఆకలిగా ఉందంటూ చేస్తున్న సర్జరీని మధ్యలో నిలిపేశాడు.

Read more!

ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి మసాలా దోశె తినేందుకువెళ్లాడు. రెండు గంటల తర్వాత మళ్లీ సర్జరీకి అటెండ్ అయి దాన్ని పూర్తి చేశాడు. అతగాడి నిర్లక్ష్యం కారణంగా ఫ్యాక్చర్ అయిన చేయి సరి కాలేదని.. వేళ్లు కూడా వంకరగా మారినట్లుగా బాలిక కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సర్జరీ తర్వాత బాలిక పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. వైద్యుడ్ని కలిసేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు సదరు డాక్టర్ అనుమతించలేదు. దీంతో.. మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

సదరు డాక్టర్ ఘన కార్యంపై నవాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసినా.. స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీకి చెప్పినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని.. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తమకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకుంటామని చెబుతున్నారు. డాక్టర్ గారి ఘనకార్యం మీడియాలో రావటంతో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News