ప్రభుత్వంపై యువత ఆగ్రహం..దేశం వీడిన టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్!
నొవాక్ జకోవిచ్.. సెర్బియా అనే చిన్న దేశం నుంచి వచ్చిన టెన్నిస్ గ్రేట్... ఏకంగా 24 గ్రాండ్ స్లామ్ లు సాధించాడు.;
శ్రీలంకలో.. బంగ్లాదేశ్ లో.. సిరియాలో.. నేపాల్ లో.. వీటన్నిటి మధ్య ఒకటే సారూప్యత...! అదేమంటే.. తమ దేశ ప్రభుత్వాలపై యువత తిరుగుబాటు..! ధరల పెరుగుదలనో... అవినీతి-బంధుప్రీతినో... నియంత ధోరణులో... పాలకులపై యువత తిరుగుబాటు సహజంగా మారింది... ఇప్పుడు మరో దేశంలో యువత తిరగబడుతోంది..! ఇది చివరకు ప్రపంచ ఆల్ టైమ్ గ్రేట్ టెన్నిస్ క్రీడాకారుడు ఆ దేశాన్నే వీడేలా చేస్తోంది.
25వ టైటిల్ కొట్టకుండానే....
నొవాక్ జకోవిచ్.. సెర్బియా అనే చిన్న దేశం నుంచి వచ్చిన టెన్నిస్ గ్రేట్... ఏకంగా 24 గ్రాండ్ స్లామ్ లు సాధించాడు. మరొక్క గ్రాండ్ స్లామ్ కొడితే చాలు.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)గా మిగిలిపోతాడు. సెర్బియా ఒకప్పటి యుగోస్లేవియాలో భాగం. 1992లో విచ్ఛిన్నమైంది. 2003లో సెర్బియా-మాంటెనిగ్రో కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. 2006లో మాంటెనిగ్రో కూడా విడిపోయింది. ఇప్పుడు సెర్బియా ప్రభుత్వంపై అక్కడి విద్యార్థులు నిరసన గళం ఎత్తుతున్నారు. వీరికి జకోవిచ్ మద్దతు పలికాడు. ఇది ప్రభుత్వానికి మండేలా చేసింది. దీంతో సెర్బియాను వదిలి వెళ్లాలనని జకో నిర్ణయించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
డిసెంబరు నుంచి...
సెర్బియాలో డిసెంబరు నుంచి ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. అప్పట్లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు.. విద్యార్థులు విజేతలు అని క్యాప్షన్ రాసి ఉన్న స్వెటర్ ధరించిన ఫొటోలను జకో సోషల్ మీడియాలో పెట్టాడు. ఒక ప్రపంచ చాంపియన్ ఇలా చేయడం ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు. కాగా, సెర్బియా ఓపెన్ (బెల్ గ్రేడ్ ఓపెన్) అనేది జకో కుటుంబం నిర్వహించే టోర్నీ. 2009 నుంచి దీనికి అక్కడి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మాత్రం సెర్బియాలో నిర్వహించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో టోర్నీని గ్రీస్ దేశ రాజధాని ఏథెన్స్ లో జరపాలని భావిస్తున్నారు. దీంతోనే జకోవిచ్ కుటుంబంతో సహా గ్రీస్ కు వెళ్లిపోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు అక్కడే..
38 ఏళ్ల జకోవిచ్ తన పిల్లలు స్టెఫాన్, తారలకు ఏథెన్స్ లో స్కూల్ అడ్మిషన్ తీసుకున్నాట. అంతేగాక గ్రీక్ గోల్దెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడట. ఇల్లు కూడా కొన్నట్లు చెబుతున్నారు. దీంతో టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్... ఒకప్పుడు సెర్బియా అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న జకోవిచ్ స్వదేశాన్ని వీడి వెళ్తున్నట్లు చెబుతున్నారు.