140 ప్రాణాలు బలితీసుకున్న డీజే.. ఆపరేటర్ అరెస్ట్.. అసలు ఏం జరిగింది?

ఒక శుభకార్యం కోసం ఏర్పాటు చేసుకున్న డీజే శబ్దాలు మూగజీవాల ప్రాణాలను బలితీసుకోవడం అత్యంత విచారకరం.;

Update: 2026-05-03 15:30 GMT

ఒక శుభకార్యం కోసం ఏర్పాటు చేసుకున్న డీజే శబ్దాలు మూగజీవాల ప్రాణాలను బలితీసుకోవడం అత్యంత విచారకరం. మనుషులకే కర్ణకఠోరంగా అనిపించే ఈ భారీ శబ్దాలు, అత్యంత సున్నితమైన పక్షులపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో ఈ ఘటన అద్దం పడుతోంది. పెళ్లిళ్లలో ఆడంబరం కోసం వాడే డీజే సౌండ్స్ నిరుపేద రైతుకు కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. సుల్తాన్‌పూర్ జిల్లా దరియాపూర్ గ్రామానికి చెందిన సాబిర్ అలీ అనే రైతు పౌల్ట్రీఫామ్ వద్ద జరిగిన ఈ ఘటన, శబ్ద కాలుష్యం మూగజీవాలపై చూపే ప్రాణాంతక ప్రభావాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది.

వద్దన్నా వినని నిర్లక్ష్యం

సాబిర్ అలీ కోళ్ల ఫామ్ నిర్వహిస్తుండగా, దాని సమీపం నుంచి ఒక వివాహ ఊరేగింపు వెళ్ళింది. ఆ ఊరేగింపులో ఉన్న డీజే వాహనం నుంచి వెలువడుతున్న భారీ శబ్దాలకు కోళ్లు భయంతో అల్లాడిపోయాయి. తన కోళ్లు విలవిలలాడడం చూసిన సాబిర్ అలీ, డీజే ఆపరేటర్ కవి యాదవ్‌ను శబ్దం తగ్గించమని వేడుకున్నాడు. యజమాని విజ్ఞప్తిని పట్టించుకోకపోగా, ఆపరేటర్ మరింత శబ్దం పెంచి పాటలు ప్లే చేస్తూ వెళ్లాడు. ఈ నిర్లక్ష్యం కారణంగా మరుసటి రోజు ఉదయానికి 140 కోళ్లు చనిపోయాయి.

పోస్టుమార్టం నివేదికలో ..

పోలీసుల జోక్యంతో నిర్వహించిన పోస్టుమార్టంలో వైద్యులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. కోళ్లు ఎటువంటి వ్యాధి వల్ల చనిపోలేదని, కేవలం డీజే శబ్దాల వల్ల కలిగిన గుండెపోటుతోనే ప్రాణాలు విడిచాయని వైద్యులు నిర్ధారించారు. పక్షుల గుండె చాలా సున్నితంగా ఉంటుందని, భారీ శబ్దాలు వాటికి ప్రాణాంతకమని ఈ ఘటన నిరూపించింది.

పక్షులు, జంతువుల వినికిడి శక్తి మనుషుల కంటే చాలా రెట్లు ఎక్కువ. అందుకే డీజే శబ్దాలు వాటికి మరణశాసనంగా మారుతున్నాయి. సాధారణంగా పక్షులు 60 నుంచి 70 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని తట్టుకోగలవు, కానీ పెళ్లిళ్లలో వాడే డీజేలు 100 నుంచి 120 డెసిబెల్స్ అంతకంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ స్థాయి శబ్దం పక్షుల సున్నితమైన కర్ణభేరిని దెబ్బతీయడమే కాకుండా, నాడీ వ్యవస్థపై ఒత్తిడిని కలిగించి క్షణాల్లో గుండెపోటుకు దారితీస్తుంది.

శబ్ద కాలుష్య నియమాల ప్రకారం నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 45 నుంచి 55 డెసిబెల్స్ మించవద్దు. కానీ డీజే ఆపరేటర్లు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ సౌండ్‌ ప్లే చేస్తున్నారు. ఈ కృత్రిమమైన భారీ శబ్దాల వల్ల కోళ్లు వంటి మూగజీవాలు తీవ్ర భయాందోళనకు గురై, దిక్కుతోచని స్థితిలో ఊపిరాడక లేదంటే గుండె ఆగడం వల్ల ప్రాణాలు విడుస్తున్నాయి. మనుషుల వినోదం కోసం వాడే ఈ పరికరాలు మూగజీవుల పాలిట యమపాశాలుగా మారుతుండడంపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆపరేటర్ అరెస్ట్

ఈ ఘటనపై బాధ్యుడైన ఆపరేటర్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. శబ్ద కాలుష్య నియమాలను ఉల్లంఘించినందుకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. డీజే వాహనాన్ని సీజ్ చేసి, యజమాని కవి యాదవ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు.

శుభకార్యాల పేరిట అతిగా ప్రదర్శించే ఈ డీజే సంస్కృతి సామాజిక సమస్యగా మారుతోంది. మూగజీవాల పట్ల కనీస కనికరం లేకుండా ప్రవర్తించడం అమానవీయం. ఈ ఘటన పౌల్ట్రీ రైతులకు మేలు చేసే విధంగా శబ్ద కాలుష్య నియమాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Tags:    

Similar News