డిజిటల్ అరెస్ట్ అని చెప్పి దారుణం.. మహిళలను నగ్నంగా కూర్చోబెట్టి...!
అవును... బెంగళూరులో సైబర్ నేరగాడు ఇద్దరు మహిళలను 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బురిడీ కొట్టించాడు.;
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల నయా స్కెచ్ డిజిటల్ అరెస్టుల పర్వం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎక్కడో ఉండి, ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ ఇంట్లో ఉన్నవారిని వణికించేస్తుంటారు.. వారిని రిమోట్ తో టీవీ ఛానల్స్ మార్చినట్లు ఆడించేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు అమ్మయక మహిళల జీవితాల్లో మర్చిపోలేని రోజుని సృష్టించారు.. ఘోరానికి తెరలేపారు.
అవును... బెంగళూరులో సైబర్ నేరగాడు ఇద్దరు మహిళలను 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బురిడీ కొట్టించాడు. అంతేకాదు... సుమారు తొమ్మిది గంటల పాటు వీడియో కాల్ లో ఉంచాడు. ఆ సమయంలో వారిని నగ్నంగా కూర్చోబెట్టి బెదిరించాడు. ఆఖరికి విషయం గ్రహించిన ఆ మహిళలు ధైర్యం చేసి కాల్ కట్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మరతహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే... థాయిలాండ్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ తన స్నేహితురాలిని కలిసేందుకు ఈ నెల 17న బెంగళూరుకు వచ్చారు. ఆ సమయంలో ఆమెకు అన్ నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ సమయంలో ఫోన్ లోని వ్యక్తి... తనను తాను పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం అసలు కథకు తెరలేపాడు. బెదిరింపులకు దిగాడు.
ఇందులో భాగంగా... జెట్ ఎయిర్ వేస్ కు సంబంధించిన అక్రమ నగదు బదిలీలో భాగమయ్యారంటూ ఆ మహిళను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే... 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఫైనల్ గా ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 58,477 బదిలీ చేయించుకున్నాడు. అక్కడితో అతడి ఆగడాలు ఆగలేదు!
ఈ క్రమంలో... బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలిని వాట్సాప్ వీడియో కాల్ లోకి రమ్మని ఆదేశించిన ఆగంతకుడు... వారిని పుట్టుమచ్చలు చూడాలని చెప్పి, ఇద్దరినీ నగ్నంగా మారమని బెదిరించాడు. ఈ క్రమంలో వారిని నగ్నంగా చాలాసేపు కూర్చోబెట్టాడు! ఈ సమయంలో సుమారు 9 గంటల తర్వాత ధైర్యం చేసిన బాధిత మహిళలు ఆ వీడియో కాల్ ను కట్ చేసారు.
తర్వాత తాము మోసపోయామని గ్రహించి, బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పందించిన బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్... డిజిటల్ అరెస్ట్ అనేది నీటి మీద బుడగలాంటిదని.. అలాంటి బెదిరింపులను అస్సలు నమ్మవద్దు అని కోరారు.