ధర్మాన చూపు.. జనసేన వైపు!
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కీలక యూటర్న్ తీసుకుంటున్నారా? వైసీపీకి ఆయన గుడ్ బై చెబుతున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి;

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కీలక యూటర్న్ తీసుకుంటున్నారా? వైసీపీకి ఆయన గుడ్ బై చెబుతున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలు. సుదీర్థ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పలు మార్లు విజయం దక్కించుకున్నారు. రాజకీయ పరిణితి.. విశ్లేషణాత్మక పనితీరు వంటివి ఆయనను రాజకీయాల్లో కీలక స్థానానికి చేర్చాయి.
కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న ధర్మాన.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటు కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే.. అప్పటి వైసీపీపై ఆయన అనేక విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఆయనకు దూరంగానే ఉన్నారు. అయితే.. తర్వాత తర్వాత.. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయలేకపోవడంతో వైసీపీ చెంతకు చేరారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్రీకాకుళం నుంచి విజయం దక్కించుకున్న ధర్మాన.. అప్పటి జగన్ మంత్రివర్గంలో రెండో దఫాలో చేరారు. కీలకమైన రెవెన్యూ పగ్గాలు చేపట్టారు. పార్టీ తరఫున కంటే కూడా విధానాల పరంగా ఆయన టీడీపీని కార్నర్ చేస్తూ వచ్చారు. ఇక, గత ఎన్నికల్లో తన కుమారుడికి అవకాశం ఇప్పించుకునే ప్రయత్నాలు చేసినా.. జగన్ కాదన్నారు. దీంతో మొక్కుబడిగానే ధర్నాన గత ఎన్నికల్లో పోటీ చేశారు.
కూటమి ప్రభావంతో ఓడిపోయారు.ఆ తర్వాత వైసీపీ విధానాలు నచ్చకపోవచ్చు, లేదా అధినేతపై ఆగ్ర హంతో కావొచ్చు.. ధర్మాన పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ఆయన చూపు జనసేనపై ఉందని.. ఆ పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన కుమారుడి భవిష్యత్తు కోసం ధర్మాన వైసీపీకి రిజైన్ చేయాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఆయన సోదరుడు కృష్ణదాస్ మాత్రం వైసీపీలోనే కొనసాగుతుండడం గమనార్హం.