శ్రీకాకుళం వైసీపీ సమావేశం.. కనిపించని ధర్మాన

తాజాగా శ్రీకాకుళంలో గురువారం నిర్వహించిన వైసీపీ జిల్లా సమావేశానికి ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టారు.;

Update: 2025-07-04 04:58 GMT

మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తీరు చర్చనీయాంశమవుతోంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ ధర్మాన ప్రసాదరావు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా శ్రీకాకుళంలో గురువారం నిర్వహించిన వైసీపీ జిల్లా సమావేశానికి ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టారు. దీంతో ధర్మాన గైర్హాజరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు శ్రీకాకుళం జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. ధర్మాన మాట కాదని ఆయా పార్టీలు జిల్లాలో ఎలాంటి కార్యకలపాలు సాగించలేని పరిస్థితి ఉండేదని చెబుతారు. 1989లోనే మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు.. ఆ తర్వాత 2004 నుంచి 20014 వరకు సుమారు పదేళ్లు పాటు మంత్రిగా జిల్లాను శాసించారు. ఇక గత ప్రభుత్వంలోనూ తొలుత ఆయన సోదరుడికి ఆ తర్వాత విస్తరణలో ప్రసాదరావుకు మంత్రి పదవులిచ్చారు.

జిల్లాలో సీనియర్ నేత ధర్మాన పార్టీ కష్టకాలంలో ముందుండి నడిపించాల్సివుండగా, ఏడాదిగా ఆయన నిస్తేజంగా మారిపోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ధర్మాన కుంగిపోయారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి ధర్మానకు కొత్త కాకపోయినప్పటికీ.. గత ఎన్నికల్లో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడమే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వంలో తమ మాటలను అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏ మాత్రం లెక్కచేయలేదన్న అసంతృప్తి ధర్మానలో గూడుకట్టుకుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

తాము ఓడిపోడానికి జగన్ విధానాలే కారణమన్న భావనలో ఉన్న మాజీ మంత్రి ధర్మాన.. వాటిని సరిచేసుకోకుండా ప్రజల్లోకి వెళ్లడం వృథా ప్రయాస అనే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. గురువారం కూడా శ్రీకాకుళంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాస్థాయి సమావేశానికి ముఖం చాటేశారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆరు పదులు వయసు దాటిన ధర్మాన ప్రసాదరావు.. తన వారసుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నారని అంటున్నారు. దీంతో అధికార పక్షంతో రాజీకి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News