మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌కర్ హౌస్ అరెస్ట్ : అమిత్ షా రియాక్షన్ ఇదే..
అనూహ్య పరిణామాల నడుమ ఉపరాష్ట్రపతి పదవి నుంచి అనారోగ్య కారణాలను చూపిస్తూ జగ్‌దీప్ ధన్‌కర్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.;
అనూహ్య పరిణామాల నడుమ ఉపరాష్ట్రపతి పదవి నుంచి అనారోగ్య కారణాలను చూపిస్తూ జగ్‌దీప్ ధన్‌కర్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన ఎందుకు అకస్మాత్తుగా తప్పుకున్నారన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక దిశగా ఎన్డీఏ, ఇండియా కూటములు వేగంగా కసరత్తు జరుపుతుండగా, ధన్‌కర్‌ను ప్రభుత్వం గృహనిర్బంధం చేసిందన్న వార్తలు వేడి వాతావరణం సృష్టించాయి. కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ ఊహాగానాలు మరింత బలంగా వినిపించాయి.
ఆ ఆరోపణలు వాస్తవం కావు..
ఇలాంటి సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించక తప్పలేదు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన ఖండించారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ, “ధన్‌కర్‌పై హౌస్ అరెస్టు ఆరోపణలు వాస్తవం కావు. ఆయన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేశారు. దీనిని రాజకీయ రంగంలోకి తేవడం తగదు” అని స్పష్టం చేశారు. ధన్‌కర్‌ను బలవంతంగా పదవి నుంచి దింపేశారన్న ప్రతిపక్ష వాదనను కూడా షా పూర్తిగా కొట్టిపారేశారు.
అయోమయం సృష్టించడానికే..
ప్రతిపక్షం వ్యాప్తి చేస్తున్న తప్పుడు ప్రచారం సమాజంలో అయోమయం సృష్టించడానికే అని షా ఆరోపించారు. “ధన్‌కర్ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారు. ఇప్పుడు ఆయనకు విశ్రాంతి అవసరం. కానీ విపక్షాలు అబద్ధాలను మేళవించి రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నాయి. ఇలాంటి వాటిపై అనవసర వాదోపవాదాలు వద్దు” అని వ్యాఖ్యానించారు.
వాస్తవం ఏమిటి?
అయితే ధన్‌కర్ రాజీనామా నిజమైన కారణం ఏమిటన్న ప్రశ్న మాత్రం ఇంకా నిలిచే ఉంది. ప్రతిపక్షం ఆయనను మౌనంగా ఉంచారని ఆరోపిస్తుండగా, కేంద్రం మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయం అంటోంది. రెండు వైపుల వాదనల మధ్య అసలు సత్యం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇకపై ఇండియా కూటమి నేతలు ఈ అంశాన్ని ఎంతగా రగదీయబోతున్నారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.