కొత్త సేవకులండీ... మోయాల్సింది ప్రభువులేనండీ !
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారే అంతిమ నిర్ణేతలు. వారు తలచుకుంటే ఎవరైనా రాజు అవుతారు.;
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారే అంతిమ నిర్ణేతలు. వారు తలచుకుంటే ఎవరైనా రాజు అవుతారు. ఆగ్రహిస్తే రాజు కూడా గద్దె దిగుతాడు. ఇంత అందంగా అర్ధవంతంగా బలమైన విధానంగా ప్రజాస్వామ్యాన్ని రూపొందించారు. మరి ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వారు అంతా సేవకులే అవుతారు. ఇది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. ప్రజలు తమ పనులు అవసరాలు మూకుమ్మడిగా చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వారే ఈ ప్రజా ప్రతినిధులు. ఇప్పటిదాకా చూస్తే దేశంలో ప్రజా సేవకులు ఒక లెక్కలో ఉండేవారు. డీలిమిటేషన్ పుణ్యామాని వారి సంఖ్య ఇంతకు మరో యాభై శాతం పెరిగి ఎటు చూసినా సేవకులే కనిపిస్తారు అన్న మాట.
పునర్ విభజనతో బిల్లుతో :
పార్లమెంట్ ప్రత్యేకంగా మూడు రోజుల పాటు సమావేశం జరిపి కొత్త చట్టం తీసుకుని వస్తోంది దాని ప్రకారం ఇపుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలకు అంతా మరో యాభై శాతం అదనంగా వస్తారు అన్న మాట. లోక్ సభలో ప్రస్తుతం 543 మంది ఉన్నారు. ఇది 1971 నుంచి ఉన్న సంఖ్య. అంటే 55 ఏళ్ళుగా ఇదే నంబర్ తో మన పార్లమెంట్ సాగుతోంది. అయితే ఇపుడు ఈ నంబర్ కాస్తా ఏకంగా 816కి చేరుకుంటోంది. అంటే 273 మంది కొత్త ఎంపీలు వస్తారు అన్న మాట.
అన్ని అసెంబ్లీల లెక్క :
ఇక దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే భారతదేశంలోని 28 రాష్ట్ర శాసనసభలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలు మొత్తం కలుపుకుని మొత్తం 4,123 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వీరికి అదనంగా మరో రెండు వేలకు పైగా కొత్త ఎమ్మెల్యేలు వస్తున్నారు. వీటిని బట్టి పెరగనున్న రాజ్యసభ సీట్లు అలాగే దేశంలోని ఏడు రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్సీ సీట్లు కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రజా సేవకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది.
సేవకుల జీతభత్యాలు :
మన ప్రజా సేవకులు తీసుకునే జీత భత్యాలు ఒక్కసారి చూస్తే ఒక్క ఎంపీ జీతం విమాన ప్రయాణాలు, ఇతర సదుపాయాల కోసం ఏడాదికి చెల్లించేది 4.29 కోట్ల రూపాయలుగా లెక్క వేస్తున్నారు ఈ తీరున కొత్తగా దేశంలో వచ్చే 273 మంది ఎంపీలకు ఎంత అన్నది చూస్తే ఏడాదికి 1,171 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక వీరికి ఏటా నిధులు ఏటా అయిదు కోట్లు అలాగే ఢిల్లీలో ఖరీదైన బంగళాలు, సెక్యూరిటీ పెన్షన్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ కి ఉచిత ప్రయాణాలు అన్నీ కలిపితే ఇదంతా దేశంలోని ప్రభువులు అనబడే సామాన్యులు మోయాల్సిన పెను భారమే అవుతుంది అంటున్నారు. అదే తీరున ఎమ్మెల్యేలకు ఇచ్చే జీత భత్యాలు వారికి సదుపాయాలు వారికి అందించే పెన్షన్లు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే రాయితీలు అన్నీ లెక్క వేస్తే తడిసి మోపెడు అవుతుంది అని అంటున్నారు.
అయిదేళ్ళకు అయ్యే భారం :
ఈ పెరిగిన సీట్లకు వచ్చే సేవకులకు రానున్న అయిదేళ్ళ కాలంలో దేశంలోని ప్రభువులు అనబడే ప్రజలు చెల్లించుకునే మొత్తాలు లేదా ఆర్థిక భారాలు చూస్తే కనుక ఏకంగా 40 వేల నుంచి 50 వేల కోట్ల రూపాయలు అవుతుందని స్థూలంగా వేసుకున్న అంచనాగా మేధావులు చెబుతున్నారు. అంటే మన సేవకుల కోసం ప్రభువులు కట్టే పన్నుల నుంచి చెల్లించే భారాలు ఇవన్న మాట.
అంతా ఒకే మాటగా :
రాజకీయ పార్టీలు అన్నీ కూడా డీలిమిటేషన్ విషయంలో వ్యతిరేకించడం లేదు, పైగా తమకు ఇంకా తక్కువ సీట్లు వస్తున్నాయని ఎక్కువ ఇస్తే సేవకులు ఎక్కువ మంది వస్తారు అని మాత్రమే అంటున్నాయి. అంటే ఏ పార్టీ అయినా తమ రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటూ డీలిమిటేషన్ కి సూత్రప్రాయంగా ఓకే చెబుతోంది అని అర్థం అవుతోంది. సీట్లు పెరిగితే రాజకీయ పార్టీలన్నింటికీ ఎంతో లాభమే. ఎవరి స్థాయికి ఎవరి సత్తాకు తగిన విధంగా ఈ లాభం వర్తిస్తుంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో భారాలు మోసేది దీర్ఘాలు తీసేది మాత్రం పన్నులు చెల్లించే సామాన్యుడే అని అంటున్నారు. ప్రతీ ఒక్కరూ కష్టపడి చెల్లించే పన్నుల నుంచే ఈ భారాలను మోస్తారు.
ఏడాదిలో వెళ్ళేది :
ఇక ప్రజా ప్రతినిధులు సభలకు ఒక ఏడాదితో గట్టిగా హాజరయ్యేది యాభై నుంచి అరవై రోజులు మాత్రమే. అది కూడా ఠంచనుగా వెళ్తేనే అని అంటున్నారు ఇక చాలా మంది ప్రజా ప్రతినిధుల మీద్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ లెక్క చూస్తే దేశంలోని ఎంపీలలో 46 శాతం మందిపైన ఈ విధంగా కేసులు ఉన్నాయి. అలాగే మొత్తం ఎంపీలలో 93 శాతం మంది అపర కోటీశ్వరులు. ఇలాంటి పరిస్థితులలో పాత సేవకులు సరిపోవడం లేదు కొత్తగా మరింతమందికి చాన్స్ ఇస్తామని బిల్లు తెస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నోరు ఎత్తాల్సింది ఆందోళన చేయాల్సింది పార్టీలు కావు. వారు చేసేది కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే. మేము ఈ పెను ఆర్థిక భారాలను మోయలేం. మాకు ఉన్న సేవకులు చాలు అని ప్రభువుల గొంతు లేవాల్సిన చోట అంతా మౌనంగా చోద్యం చూస్తున్నారు. ఎందుకంటే అసలైన ప్రభువులు వారు కారు అన్నది ఎపుడో తేలిపోయింది కాబట్టి.