డీలిమిటేషన్ అస్త్రం...బీజేపీని తట్టుకోవడం కష్టమేనా ?
| డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. చిన్న నియోజకవర్గాలతో ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువవుతారని మద్దతుదారులు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఓటు బ్యాంకులను విభజించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చిందనే చర్చ సాగుతోంది.
డీలిమిటేషన్ బిల్లు విషయంలో దేశవ్యాప్తంగా ఇపుడు చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్ సభ అసెంబ్లీల సీట్లను అదనంగా యాభై శాతం పెంచడం అన్నది ఒక కొత్త విధానంగా ఉంది. అదే సమయంలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ఉన్న 543 సీట్లు కాస్తా ఏకంగా 850 దాకా పెరిగిపోతాయి. ఈ పెరిగే సీట్లు ప్రజా స్వామ్య దేశంలో మరింతగా ప్రజా ప్రతినిధులు జనాలకు చేరువ అయ్యేందుకు చిన్న నియోజకవర్గాల ద్వారా సాధ్యం అని అంటున్నారు. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే ఈ డీలిమిటేషన్ బిల్లులో రాజకీయ ప్రయోజనాలు లేవా అన్నది. లేకపోతే ఇంత పట్టుదల బీజేపీ పెద్దలకు ఈ బిల్లు విషయంలో ఎందుకు అన్నదే అంతటా వినిపిస్తున్న ప్రశ్న.
అసలేమి జరుగుతుంది :
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్ సభ నియోజకవర్గాల స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోతాయి. ఎందువల్ల అంటే ఉన్న వాటిని రెండుగా మూడుగా విడదీయాల్సి ఉంటుంది. అలా చేయమనే కదా ఈ బిల్లు ఉద్దేశ్యం అనుకోవడం కరెక్టే కానీ అక్కడే రాజకీయ ప్రయోజనాలు అన్నవి కూడా ఇమిడి ఉంటాయని కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలు తీవ్రంగా అనుమానిస్తున్న దాంటో నిజాలు లేకపోలేదని అంటున్నారు. అది ఎలా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది ఎంత పారదర్శకంగా జరిపామని చెప్పుకున్నా అధికారంలో ఉన్న వారికే ఎక్కువగా జోక్యం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు. దాదాపుగా ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేసి మరీ దాని పూర్వ స్వభావాన్ని మారుస్తారు. ఇందులో చూసేది జనాభా ఒక్కటేనా లేక ఇతరత్రా అంశాలా అంటే అక్కడే విపక్షాలకు డౌట్లు వస్తున్నాయి అని అంటున్నారు.
గెలుపు వ్యూహాలతో :
ఒక పెద్ద నియోజకవర్గంలో ఎపుడూ గెలవని పార్టీ దానిని తమకు అనుకూలంగా రెండుగా లేదా మూడుగా విడగొట్టినపుడు తమ ఓటు బ్యాంక్ ని ఆ మూడు చోట్లా సర్దుకుని విపక్ష ఓటు బ్యాంక్ ని తగ్గించేలా స్వరూప స్వభావాలు మారిస్తే కనుక అ ఆ మేరకు ఎవరికి లాభం కలుగుతుంది అంటే జవాబు అందరికీ తెలిసిందే. అందుకే రాహుల్ గాంధీ కాన్వాస్ చేతికి ఇచ్చి ఇష్టం వచ్చిన బొమ్మ గీసుకోమని బీజేపీకి అధికారం అప్పగిస్తున్నారు అని అంటున్నారు. ఇక తమకు బలం లేదు అన్న చోట్ల మాత్రమే కాకుండా బాగా బలం ఉన్న చోట్ల కూడా దానికి బలహీన నియోజకవర్గాలకు మరికొంత బదిలీ చేసి రెండు చోట్లా గెలిచే వ్యూహాలు కూడా అమలు చేయవచ్చు కదా అన్నది కూడా మరో సందేహం. కొన్ని వర్గాలు సెక్షన్ల ఓట్లు తమకు దక్కవని అన్నపుడు అక్కడ కూడా విభజన చేసి వారి సంఘటిత ఓట్లను రెండూ లేదా మూడుగా విభజించినట్లైతే ఆ మేరకు కూడా అనుకున్న ఫలితాలు అధికారంలో ఉన్న వారికే దక్కుతాయి కదా అని కాంగ్రెస్ పెద్దలు విమర్శిస్తున్నారు. వారు అంటున్నారు అని కాదు దీనిలో కూడా నిజం ఉంది కదా అన్నదే మేధావుల నుంచి వస్తున్న మాటగా ఉంది.
ఒకే పార్టీకి మొగ్గు :
ఇది కూడా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ. ఎప్పటికీ ఒకే పార్టీకి మొగ్గుగా ఉండేలా డీలిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. అందులో అనేక వర్గాలకు అన్యాయం జరుగుతుందని కూడా రాహుల్ కామెంట్స్ చేశారు. ఆయన అన్న దాంట్లో తప్పు ఉందని కానీ ఆవేదనలో నిజం లేదని కానీ ఎవరూ అనలేరు. దానికి కారణం గతంలో జరిగిన డీలిమిటేషన్ల విధానం అని గుర్తు చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి వీలుగా మార్చుకుంటారు. అందుకే ఇపుడు కాంగ్రెస్ సహా విపక్షాలు భయపడుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో 2029 ఎన్నికల అజెండాతో బీజేపీ ఈ డీలిమిటేషన్ అస్త్రాన్ని బయటకు తీసిందని అంటున్నారు. ఇది అమలు అయి పెరిగిన నియోజకవర్గాలతో ఎన్నికలకు వెళ్తే బీజేపీని తట్టుకోవడం కష్టమే అన్న రాజకీయ విశ్లేషణ అయితే ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.