ఇప్పట్లో సీట్లు పెరగవు...డీలిమిటేషన్ ఈజీ కాదు
దేశంలో ఉన్న 543 ఎంపీ సీట్లు కాస్తా 850 దాకా పెరుగుతాయి అన్నది ఇప్పటి దాకా అంతా అంటున్న మాట.;
దేశంలో ఉన్న 543 ఎంపీ సీట్లు కాస్తా 850 దాకా పెరుగుతాయి అన్నది ఇప్పటి దాకా అంతా అంటున్న మాట. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నది ఒక సామెత ఉంది. విపక్షం ఎంత బలంగా ఉంది అన్నది మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యం తెలియచేస్తోంది. డీలిమిటేషన్ చుట్టూ అనేక సెంటిమెంట్లు కూడా అల్లుకుని ఉన్నాయి. పైగా ప్రస్తుత లోక్ సభలో అధికార ఎన్డీయేకు బొటా బొటీ మెజారిటీ ఉంది. దాంతో డీలిమిటేషన్ బిల్లుని తెచ్చి ఆమోదించడం అన్నది కష్ట సాధ్యంగానే కనిపిస్తోంది అని నిపుణులు అంటున్నారు.
సవరణ చేయాలంటే :
రాజ్యంగంలోని 131 సవరణ చేయాలీ అంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. ప్రతిపక్షం అంతా ఐక్యంగా ఉన్న సందర్భంలో అది జరిగి తీరుతుందా అంటే లెక్కలు చూస్తే అధికార ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా లేవని అంటున్నారు. ఎన్డీయేకు వాస్తవమైన బలంగా 298 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని పొందలేకపోయింది. రేపటి రోజున అయినా అది జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది.
ప్రతిపక్షం పట్టు :
ఇక దేశంలోని చట్ట సభలలలోని నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలోని కీలక అంశాలను విపక్షం తిరస్కరిస్తోంది . 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లను పెంచాలని ప్రతిపాదించిన బిల్లును లోక్‌సభ పూర్తి స్థాయిలో తిరస్కరించింది.మహిళా కోటా అమలుకు సంబంధించిన బిల్లు ఓటమికి ప్రతిపక్షం ఐక్యంగా కృషి చేసింది. అదే సమయంలో జనాభా ఆధారంగా సరిహద్దులను తిరిగి మార్చేందుకు ఉద్దేశించిన డీలిమిటేషన్ బిల్లు ఉత్తర రాష్ట్రాలకు అనుకూలంగా తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని దక్షిణ రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అనేక సవాళ్ళతో :
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని మళ్ళీ సభ ముందుకు తీసుకుని రావచ్చు. అయినప్పటికీ ప్రస్తుతం లోక్ సభలో బలాబలాలు ఏ మాత్రం మారవు అని అంటున్నారు దాంతో డీలిమిటేషన్ అన్నది అనేక రాజకీయ సవాళ్లతో కూడుకున్నది అని అర్ధం అవుతోంది. అంతే కాదు భవిష్యత్తులో జరగబోయే ఏ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కైనా రాజ్యాంగ సవరణ అవసరం. అది జరగాలంటే సంఖ్యా బలం మీదనే ఆధారపడి ఉంది.
జనాభా గణనతో పాటుగా :
ఇక జనాభా గణనతో పాటుగా కుల గణన కూడా చేపట్టిన తరువాత అపుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియని చేపట్టాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. అంతే కాదు అనేక ఇతర రిజర్వేషన్లు కూడా పొందుపరచాల్సి ఉందని వాదిస్తోంది. ఇవన్నీ చిక్కు ముళ్ళుగా మారనున్నాయి. అంత సులువుగా తేలే విషయాలు అయితే కావు అని అంటున్నారు. ఇక 2027 మధ్యలో జనాభా గణన దానితో పాటుగా కుల గణన పూర్తి అయినా డీలిమిటేషన్ బిల్లు సభ ముందు పెట్టి అందరినీ ఒప్పించి ఆమోదించుకున్నా 2029 నాటికి సీట్లను పెంచి ఎన్నికలకు వెళ్ళేందుకు సమయం సరిపోతుందా అన్నది మరో ప్రశ్న. ఏది ఏమైనా సరైన సమయం అనుకునే 2026 ఏప్రిల్ లో సభ ముందుకు కేంద్రం డీలిమిటేషన్ ప్రతిపాదనలు తెచ్చింది. ఇపుడు జరగలేదు అంటే మరి ఎపుడు జరుగుతాయి అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ఇప్పట్లో సీట్లు పెరుగుతాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది అంటున్నారు.