ఆ ఖాతా నుంచి వందల కోట్లు ట్రాన్సాక్షన్.. కానీ ఖాతాదారుడికి తెలియని వైనం..

బట్టతలపై బంగారు కిరీటం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. జుట్టు లేకున్నా.. బంగారు కిరీటం ఉండడం అదృష్టమే కదా.. సాధారణ పని చేసుకునే వ్యక్తికి ఉన్నట్టుంది వందల కోట్లు బ్యాంకు ఖాతాలో జమ కావడం విస్తును గొల్పింది.;

Update: 2025-11-29 05:26 GMT

బట్టతలపై బంగారు కిరీటం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. జుట్టు లేకున్నా.. బంగారు కిరీటం ఉండడం అదృష్టమే కదా.. సాధారణ పని చేసుకునే వ్యక్తికి ఉన్నట్టుంది వందల కోట్లు బ్యాంకు ఖాతాలో జమ కావడం విస్తును గొల్పింది. బైక్‌, ట్యాక్సీ నడిపి పొట్టకూటి సంపాదించే ఓ సాధారణ మనిషి బ్యాంక్‌ ఖాతాలో ఒక్కసారిగా రూ.331 కోట్లు కనిపించాయి. ఢిల్లీ మురికివాడలో రెండు గదుల ఇంట్లో జీవించే డ్రైవర్‌ ఖాతాలో అంత భారీ డిపాజిట్‌లు రావడం అసలు ఆ డబ్బు ఎవరిది? ఎలా వచ్చింది? ఎవరు వాడుకున్నారు? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ మనిషి పేరు, గుర్తింపు, ఆర్థిక బలహీనత అన్నీ ఇవే నేటి మనీలాండరింగ్ మాఫియాలకు ‘పర్ఫెక్ట్ ట్రాప్’ అవుతున్న మరో ఉదాహరణగా ఇది నిలిచింది.

అమాయకులే పావులు..

మనీలాండరింగ్ దర్యాప్తుల్లో తరచూ కనిపించే ఒక నమూనా దోపిడీ, ఆన్‌లైన్ బెట్టింగ్, అపరాధాల ద్వారా సంపాదించిన నల్లధనం ఎప్పుడూ అమాయకుల పేర్లతో తిరుగుతుంది. ఈ కేసు కూడా దాదాపు అదే దారిలో నడిచింది. ఓ బెట్టింగ్ యాప్ (1XBET)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 2024, ఆగస్టు 19 నుంచి 2025, ఏప్రిల్ 16 వరకు ఆ బైక్ డ్రైవర్ ఖాతాలో నమోదైన ట్రాన్సాక్షన్ల మొత్తం రూ.331 కోట్లు.

అధికారులు బ్యాంకు ఖాతాలో ఉన్న చిరునామాకు వెళ్లి చూసినప్పుడు, అక్కడ ఏదో పెద్దవ్యక్తి, వ్యాపారవేత్త, ధనవంతుడు ఉంటాడని ఊహించారు. కానీ వాస్తవం పూర్తిగా భిన్నంగా మారింది. రోజుకు వచ్చిన రైడ్‌లతో జీవనం నెట్టుకుంటూ ఉండే, ఒక ప్రసిద్ధ క్యాబ్ అగ్రిగేటర్ కోసం పనిచేసే డ్రైవర్ మాత్రమే అక్కడ నివసిస్తున్నాడు. అతని జీవన స్థితి, ఆర్థిక పరిస్థితి, ఆవాసం చూస్తే అతని ఖాతాలోని కోట్లతో ఏ మాత్రం సరిపోలలేదు.

మ్యూల్ అకౌంట్ గా వినియోగం..

మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ డ్రైవర్ ఖాతా నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ వివాహానికి రూ. కోటి చెల్లింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఆ వివాహం ఒక గుజరాతీ యువ రాజకీయ నేత కుటుంబానికి సంబంధించినదని అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలన్నీ డ్రైవర్‌కు పూర్తిగా తెలియకుండా జరిగినట్లు తేలడంతో, ఇది పూర్తిగా మ్యూల్ అకౌంట్ ఉపయోగం అని ఈడీ స్పష్టంగా చెబుతోంది. ‘నా బ్యాంకు ఖాతా ద్వారా ఏం జరిగిందో నాకు తెలియదు’ అని డ్రైవర్ చెప్పిన మాటలు నిజాలే.. డిజిటల్ మోసాల అగాథం సాధారణ మనిషిని పెద్ద నేరాల భాగస్వామిలా బయటకు లాగేస్తాయి.

ఈ డ్రైవర్ ఖాతాను మ్యూల్ అకౌంట్‌గా వాడుకున్నారని ఈడీ భావించింది. అంటే, అసలు నేరస్తులు తాము నేరుగా ఉపయోగించలేని ధనాన్ని ‘ఇతరుల బ్యాంకు ఖాతాల్లో’ దాచిపెట్టడం లాంటిది. ఇలాంటి వ్యక్తులు సాధారణంగా పేదవాళ్లు, రోజువారీ శ్రమతో జీతం సంపాదించే వారు అయి ఉంటారు. తమ పేరు వాడుకున్నారన్న విషయం కూడా వారికి తెలీకుండా మోసపోతుంటారు.

పాపం ఇంత డబ్బు ట్రాన్జాక్షన్ గురించి తెలియదు..

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. వీటిలో జరిగే కోట్ల రూపాయల డబ్బు ట్రాన్జాక్షన్, నల్లధన విరాళాలు, విదేశీ ట్రాన్జాక్షన్లు అన్నీ భారత ఆర్థిక నేర విభాగాలకు పెద్ద సవాలుగా మారాయి. 1XBET కేసు కూడా ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యం సంతరించుకుంది. నేరస్తులు తమ డబ్బును ట్రాక్ చేయలేని విధంగా 10, 15 ఖాతాల మీదుగా ‘వాష్’ చేస్తారు. ఇందులో అమాయక డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఈ ట్రాన్జాక్షన్స్ దాదాపుగా తెలియకుండానే జరుగుతుంది.

ఈ కేసుతో తెలుసుకోవాల్సింది..

ఈ కేసు మనకు మరో ముఖ్యమైన సందేశం ఇస్తుంది. డిజిటల్ యుగంలో మన బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ వివరాలు ఎంత విలువైనవో అంతే ప్రమాదకరం. ఒక చిన్న నిర్లక్ష్యం, చిల్లర ఆకర్షణ, చిన్నసాయం పేరుతో సైన్ చేసిన పేపర్లు ఇవి మనల్ని కోట్ల రూపాయల నేరాల్లో నిందితులుగా నిలబెట్టే ప్రమాదం ఉంది. ట్యాక్సీ డ్రైవర్ దర్యాప్తులో డ్రైవర్ నిరపరాధిగా కనిపించినా, అతన్ని ఉపయోగించుకున్న పెద్ద నెట్‌వర్క్‌ను గుర్తించడం ఈడీ ముందున్న ప్రధాన సవాలు. భారత ఆర్థిక నేరాల వ్యవస్థలో ఈ తరహా మ్యూల్ అకౌంట్ల సంఖ్య పెరుగుతుందని తెలుస్తోంది.

Tags:    

Similar News