ఢిల్లీలో BMW కారు ప్రమాదం : రోడ్డు ప్రమాదమా లేక కావాలనే ప్రాణాలు తీశారా?

ఆదివారం నవ్‌జ్యోత్ సింగ్ దంపతులు దిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్‌ దగ్గర బైక్‌పై వెళ్తుండగా, ఒక BMW కారు వారిని బలంగా ఢీకొట్టింది.;

Update: 2025-09-15 21:30 GMT

ఢిల్లీలో జరిగిన BMW కారు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జ్యోత్ సింగ్ (52) మరణించగా, ఆయన భార్య సందీప్ కౌర్ గాయపడ్డారు. ఈ కేసులో కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి.

ప్రమాదం తర్వాత ఏం జరిగింది?

ప్రమాదం జరిగిన తర్వాత నవ్‌జ్యోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ కారు డ్రైవర్‌ని పదేపదే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లమని వేడుకున్నారు. కానీ డ్రైవర్ పట్టించుకోకుండా 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆమె పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. ఈ నిర్ణయం ఉద్దేశపూర్వకమని, దీని వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ప్రమాదం ఎలా జరిగింది?

ఆదివారం నవ్‌జ్యోత్ సింగ్ దంపతులు దిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్‌ దగ్గర బైక్‌పై వెళ్తుండగా, ఒక BMW కారు వారిని బలంగా ఢీకొట్టింది. కారును గురుగ్రామ్‌కు చెందిన గగన్‌ప్రీత్ కౌర్ నడుపుతున్నారు. కారులో ఆమె భర్త పరీక్షిత్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో నవ్‌జ్యోత్ సింగ్ తీవ్రంగా గాయపడి చనిపోగా, సందీప్ కౌర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

*కుట్ర కోణం ఉందా?

సందీప్ కౌర్ - నవ్‌జ్యోత్ కుమారుడు ఒకటే విషయాన్ని చెబుతున్నారు. "దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి ఉంటే నాన్న ప్రాణాలు నిలిచేవి. కానీ నిందితులు తమని తాము కాపాడుకోవడానికే దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఎందుకంటే ఆ ఆసుపత్రి యాజమాన్యంతో వారికి సంబంధం ఉంది" అని వారు ఆరోపిస్తున్నారు.

నిందితులపై చర్యలు

ప్రమాదానికి కారణమైన గగన్‌ప్రీత్ కౌర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆమె భర్త పరీక్షిత్ పేరు కూడా చేర్చారు. అయితే, గగన్‌ప్రీత్ తండ్రి ఆ ఆసుపత్రికి సహ-యాజమాని అని తెలిసిన తర్వాత ఈ కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనితో పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ ప్రారంభించారు.

*ఆసుపత్రి వివరణ

తమపై వస్తున్న ఆరోపణలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. "అన్ని నిబంధనలను పాటించాం. ఎలాంటి తప్పులు జరగలేదు" అని వారు స్పష్టం చేశారు. కానీ, గగన్‌ప్రీత్ కుటుంబానికి ఆసుపత్రితో ఉన్న సంబంధాన్ని ధృవీకరించడానికి మాత్రం నిరాకరించారు. ఈ విషయం కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.

ఈ ఘటన కేవలం ఒక రోడ్డు ప్రమాదమా లేక కావాలనే ప్రాణాలను కాపాడే అవకాశాన్ని నిర్లక్ష్యం చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్నాయి.

Tags:    

Similar News