పార్లమెంట్‌లో డీప్‌ఫేక్ ఫోటో ప్రదర్శన.. తన నగ్న ఫోటోలు అందరికీ చూపించిన ఎంపీ

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, దాన్ని తప్పుగా వాడుకునే ప్రమాదం కూడా అంతే వేగంగా పెరుగుతోంది;

Update: 2025-06-07 01:30 GMT

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, దాన్ని తప్పుగా వాడుకునే ప్రమాదం కూడా అంతే వేగంగా పెరుగుతోంది. మానవ అభివృద్ధికి టెక్నాలజీ ఎంతలా ఉపయోగపడుతుందో తెలియదు కానీ దాని దుర్వినియోగంతో సమాజానికి కొన్ని సవాళ్లను మాత్రం విసురుతోంది. అలాంటి సవాళ్లలో ఒకటి డీప్‌ఫేక్ . కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) ఆధారంగా పనిచేసే ఈ టెక్నాలజీ, రియల్ వీడియోలు లేదా ఫోటోలను మార్చి, వాటిని అసలు జరగని సంఘటనలుగా, లేదా వ్యక్తులు చెప్పని మాటలుగా మార్చి చూపించగలదు. ఇది కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, ఇప్పుడు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ఫోటోలను ఉపయోగించి, డీప్‌ఫేక్ ద్వారా అశ్లీల చిత్రాలను లేదా వీడియోలను క్రియేట్ చేసి వైరల్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఈ డీప్‌ఫేక్ సమస్య ఎంత ప్రమాదకరమైనదో, ఎంత సులువుగా దీనిని సృష్టించవచ్చో ప్రపంచానికి తెలియజేయడానికి న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఒక సంచలన సంఘటన జరిగింది. న్యూజిలాండ్ మహిళా ఎంపీ లారా మెక్‌క్లూర్‌ (Laura McClure) ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మే 14, 2025న (దాదాపు నెల రోజుల క్రితం) ఆమె స్వయంగా తన సొంత ఏఐ-సృష్టించిన (AI-generated) డీప్‌ఫేక్ నగ్న ఫోటోను పార్లమెంట్‌లో ప్రదర్శించారు.

ఆమె పార్లమెంట్‌కు మాట్లాడుతూ.."ఈ ఫోటో నా నగ్న చిత్రమే, కానీ ఇది నిజం కాదు" అని స్పష్టం చేశారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఒక సాధారణ వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఈ డీప్‌ఫేక్ ఫోటోను తాను తయారు చేశానని ఆమె వెల్లడించారు. ఈ చర్య న్యూజిలాండ్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. డీప్‌ఫేక్ సమస్య ఎంత జటిలంగా మారిందో, ఎంత సులువుగా ప్రజల ప్రతిష్టను దెబ్బతీయవచ్చో ఈ ఘటన ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపించింది. బాధితులకు ఇది ఎంత అవమానకరంగా, ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది.

ఇలాంటి డీప్‌ఫేక్ చిత్రాలు సమాజానికి, ముఖ్యంగా మహిళలకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని లారా మెక్‌క్లూర్‌ పార్లమెంట్‌ దృష్టికి తీసుకువచ్చారు. డీప్‌ఫేక్‌ను నేరంగా పరిగణించడానికి, అంగీకారం లేకుండా సన్నిహిత చిత్రాలను షేర్ చేయడం పై ఉన్న చట్టాలలో డీప్‌ఫేక్‌ను కూడా చేర్చడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం చాలా అవసరమని ఆమె నొక్కి చెప్పారు. నగ్న చిత్రాల సమస్య న్యూజిలాండ్‌కే పరిమితం కాదని, ప్రపంచమంతా ప్రస్తుతం ఈ డీప్‌ఫేక్ బాధితుల బెడదను ఎదుర్కొంటోందని ఆమె స్పష్టం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News