డీసీసీబీ పదవి కోసం కూటమి నేతల క్యూ !
అయితే ఎన్నికల ముందు ఒక హామీ జనసేనకు ఉందిట. ఆ పదవిని జనసేనకు ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారని అంటున్నారు.;
పదవి ఎవరికైనా కావాల్సిందే. పదవి ఉంటే వచ్చే ఆ దర్జాయే వేరు. కామి కాని వాడు మోక్షగామి కాడు అని పురాణాలలో చెబుతారు. అదే రాజకీయాల్లో పదవిని ఆశించని వారు మోక్షగామి కానే కారు అని అంటారు. అందుకే పదవుల కోసం చాలా మంది చకోర పక్షాలుగా ఎదురుచూస్తారు.
విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ పోస్టు కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున పోటీ సాగుతోంది. ఈ పదవి జిల్లాలో కీలకంగా ఉంది. వేల కోట్ల రూపాయలతో నడచే ఈ బ్యాంక్ చైర్మన్ కి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుకుబడి పవర్ అన్నీ ఉంటాయి. దాంతో ఈ పదవిని చేపట్టాలని ఉత్సాహవంతులు అంతా రెడీ అయిపోతున్నారు.
అయితే ఎన్నికల ముందు ఒక హామీ జనసేనకు ఉందిట. ఆ పదవిని జనసేనకు ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారని అంటున్నారు. దాంతో జనసేనలో కూడా పోటీ ఉంది. అయితే టీడీపీ నుంచి కూడా ఈ పదవి కోసం పెద్ద ఎత్తున రేసులో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఈ పదవిని గ్రామీణ ప్రాంతానికే ఇవ్వాలని కూడా కూటమిలో మరో చర్చ సాగుతోంది.
ఎందుకంటే డీసీసీబీ పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినది అని గుర్తు చేస్తున్నారు. రైతుల సమస్యలు వారికి సంబంధించిన వ్యవహారాలు రుణాలు ప్రాధమిక వ్వ్యసాయ సంఘాల కార్యకలాపాలు వీటి మీద అవగాహన ఉన్న వారు అయితేనే డీసీసీబీ బాగా నడుస్తుంది అని అంటున్నారు.
ఇక ఈ పదవి కోసం అనకాపల్లి చోడవరం ప్రాంతాలకు చెందిన నాయకులు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో కానీ వైసీపీ హయాంలో కానీ ఈ పదవి ఎలమంచిలి తో పాటు విశాఖ వారికి దక్కింది. అలాగే ఎక్కువ సార్లు నర్శీపట్నం, మాడుగుల చోడవరం ప్రాంతాలకు చెందిన వారికే దక్కింది కాబట్టి ఈసారి చాన్స్ అనకాపల్లి వారికి ఇవ్వాలని మరో డిమాండ్ కూడా ఉంది.
అయితే ఈ పదవి విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ పోటీ చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విశాఖ అర్బన్ నేతలు ఈ పదవికి పోటీ పడడంతో మొత్తం సీన్ మారిపోతోంది. ఇక చోడవరం ప్రాంతానికి చెందిన జనసేన నేత, ఎమ్మెల్యే టికెట్ ని పొత్తుల కోసం త్యాగం చేసిన వారుగా ఉన్న పీవీఎస్ఎన్ రాజుకు ఈ పదవి ఇస్తే అందరికీ న్యాయం చేస్తారని రైతాంగం నుంచి ప్రాధమిక సహకార సంఘం సభ్యుల నుంచి మద్దతుగా మాట వస్తోందిట.
ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఉన్నారని గ్రామీణ ప్రాంత సమస్యల మెద ఆయన పూర్తి అవగాహనతో పనిచేస్తున్నారని అంటున్నారు అదే సమయంలో అనకాపల్లికి చెందిన టీడీపీ నేతలు కూడా పోటీ పడుతున్నారు. సాధ్యమైనత తొందరలో ఈ పదవిని భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోంది. మరి డీసీసీబీ కిరీటం ఎవరికి దక్కుతుందో చూడాల్సిందే.