దానంకు పదవీ గండం: బెంగాల్ ఎమ్మెల్యేపై వేటు వేసిన కలకత్తా హైకోర్టు
అవును.. తాజాగా ఒక హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోలేదు.;
అవును.. తాజాగా ఒక హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడీ తీర్పు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు తెర తీయటం ఖాయం. కన్ఫ్యూజ్ అవుతున్నారా? క్లారిటీగా చెబుతాను పదండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేల సంగతి తెలిసిందే. వీరిలో ముఖ్యుడు మాజీ మంత్రి దానం నాగేందర్.
దానం మాదిరి పది మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవటం.. దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించిన.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరటం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. త్వరలోనే తీర్పు వస్తుందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భిన్నంగా 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా.. దానంపై మాత్రం పక్కాగా అనర్హత వేటు పడుతుందని చెబుతున్నారు.
దీనికి కారణం పశ్చిమబెంగాల్ రాష్ట్ర హైకోర్టు (కలకత్తా హైకోర్టు) తాజాగా వెలువరించిన తీర్పే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద గెలిచిన మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ ఆ తర్వాత పార్టీ నుంచి జంప్ అయి దీదీ పార్టీ (టీఎంసీ)లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. పార్టీ ఫిరాయింపుపై ముకుల్ రాయ్ ను అనర్హుడిగా పేర్కొంటూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో.. ఈ తరహాలోనే దానంపైనా వేటు ఖాయమని.. త్వరలో తెలంగాణ హైకోర్టు కూడా ఇదే తరహాలో తీర్పు రానున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ తీర్పు దానంకు శరాఘాతంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.