ఎమ్మెల్యే దానం కేసు యూటర్న్: హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు వ్యవహారం యూటర్న్ తీసుకుంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ఇప్పుడు దానంకు తీవ్ర అగ్నిపరీక్షగా మారింది.;
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు వ్యవహారం యూటర్న్ తీసుకుంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ఇప్పుడు దానంకు తీవ్ర అగ్నిపరీక్షగా మారింది. గత 2023 ఎన్నికల్లో దానం బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. అధికార కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా మారారు. దీంతో ఆయనపైఅనర్హత వేటు వేయాలని బీఆర్ ఎస్ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.
వీటిని సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.. మొత్తం 10 మంది బీఆర్ ఎస్ ఎమ్మె ల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఈ విషయం ఇలా ఉంచితే.. తాజాగా ఏలేటి మరో విషయాన్ని లేవనెత్తారు. దీని ఆధారంగా దానంపై అనర్హత వేటు వేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్.. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని.. కానీ, వాస్తవానికి ఆయన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక పార్టీనుంచి ఎన్నికైన అభ్యర్థి.. మరో పార్టీ టికెట్పై ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధమని.. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో దానం 2024లో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన నాటి నుంచే ఆయన పై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరారు. అంతేకాదు.. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలానే చేసిన వారిపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడిందని.. తీర్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. దానం నాగేందర్ సహా.. అసెంబ్లీ సచివాలయ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. ఒక పార్టీ తరఫున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. మరో పార్టీ టికెట్ పై ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ.. నోటీసులు జారీ చేయడం గమనార్హం. దీంతో దానం ఏం చెబుతారో చూడాలి. ఈ కేసును సీరియస్‌గా తీసుకోవాలన్న ఏలేటి అభ్యర్థనను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం.