ఇంతదారుణమా? పీరియడ్స్ విద్యార్థినికి బయట పరీక్షనా?
నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను అర్థం చేసుకోకుండా, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించే ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.;
నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను అర్థం చేసుకోకుండా, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించే ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలసరి శుభ్రతపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, పాలసీలు రూపొందిస్తున్నా.. కొందరు మాత్రం తమ మూఢనమ్మకాలను, వివక్షను వీడటం లేదు. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. పీరియడ్స్‌లో ఉన్న ఒక దళిత విద్యార్థినిని పరీక్ష రాయడానికి తరగతి గదిలోకి అనుమతించకుండా బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు.
కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినికి ఏప్రిల్ 5న మొదటిసారి రుతుక్రమం మొదలైంది. రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 7న ఆమె ఫైనల్ పరీక్షలు రాయడానికి పాఠశాలకు వెళ్లింది. అయితే, ఆ విద్యార్థిని పీరియడ్స్‌లో ఉందని తెలుసుకున్న ఉపాధ్యాయులు ఆమెను తరగతి గదిలోకి అనుమతించలేదు. ఏకంగా తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
తన కుమార్తెకు జరిగిన అన్యాయం తెలుసుకున్న బాలిక తల్లి బుధవారం పాఠశాలకు వెళ్ళింది. అక్కడ కూడా తన కుమార్తె తరగతి బయటే కూర్చొని పరీక్ష రాస్తూ కనిపించింది. ఆగ్రహించిన ఆ తల్లి వెంటనే ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన పాఠశాల యాజమాన్యంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి తల్లి వెంటనే విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ చోటుచేసుకుంది. మేరఠ్‌లో 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పరీక్ష రాస్తుండగా ఆమెకు నెలసరి వచ్చింది. శానిటరీ నాప్‌కిన్ కావాలని ఎగ్జామినర్‌ను అడగగా, ఆమెను తరగతి గది నుంచి బయటకు పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ రెండు ఘటనలు మన సమాజంలో నెలకొన్న వివక్షకు, అజ్ఞానానికి నిదర్శనం. నెలసరి అనేది ఒక సహజ ప్రక్రియ అని, దానిని అంటరానితనంగా చూడటం ఎంత మాత్రం సమంజసం కాదని విద్యావంతులు సైతం ఇలా ప్రవర్తించడం అత్యంత బాధాకరం. విద్యార్థినులకు ఇలాంటి అవమానాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పాఠశాలలదే. విద్యాశాఖ అధికారులు ఈ ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నెలసరి సమయంలో విద్యార్థినులకు అన్ని విధాలా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.