మరో తుఫాన్.. మొంథాను మించిన ముప్పు!
మొంథా తుపాను కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఏపీ రైతాంగానికి మరో తుఫాన్ ముప్పు పొంచివున్నట్లు అధికారులు ప్రకటించారు.;
మొంథా తుపాను కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఏపీ రైతాంగానికి మరో తుఫాన్ ముప్పు పొంచివున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 22న బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్ గా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైన దశలో తుఫాన్ హెచ్చరికలు రావడంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో వాతావరణం భయపెడుతోందని టెన్షన్ పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడబోతోన్న తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
బంగాళాఖాతంలో మలక్కా జలసంధి దాని పరిసరాల్లో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం అవరించిందని వాతావరణ నిపుణులు గుర్తించారు. దీనిప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడనుందని అంటున్నారు. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ కల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ తీరంవైపు రానుందని భారత వాతావరణ శాఖ తన అప్డేట్ లో తెలిపింది.
కాగా ఈ నెల 26న ఏర్పాటుకానున్న తుఫాన్ కు ‘సెనయార్’ అనే పేరు పెట్టారు. దీన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది. అయితే ఐఎండీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గురువారం నాటి పరిస్థితుల మేరకు ఈ నెల 24న తొలుత తమిళనాడులో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, ఆ తర్వాత దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాల్లో వర్షాలు కురుస్తాయి. ఈ మూడు రోజులు భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ తుఫాన్ కూడా మొంథా తుఫాన్ మాదిరిగా కాకినాడ-మచిలీమట్నం మధ్యే తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తుఫాన్ తీరం దాటే ప్రాంతంలో మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఏదైనా సరే కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ తుఫాన్ హెచ్చరికలతో రాష్ట్రంలో వరి, పత్రి రైతులు అప్రమత్తం కావాలని ప్రభుత్వం సూచిస్తోంది.