టీడీపీ ఎమ్మెల్యే ఫ్యామిలీ డిజిటల్ అరెస్ట్...తర్వాత జరిగింది ఇదే !

సైబర్ నేరగాళ్ళు తమ రూట్ మార్చారు. డబ్బున్న వారి కుటుంబాలను టార్గెట్ గా చేసుకుంటున్నారు. వారి విషయాలను అన్నీ తెలుసుకుని తమ తెలివి తేటలతో బోల్తా కొట్టిస్తున్నారు.;

Update: 2025-11-17 15:23 GMT

టెక్నాలజీ కొత్త పుంతలు వేస్తోంది. దాని వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతకు రెట్టింపు ఉంది. కొత్త వ్యూహాలు సరికొత్త ఆలోచనలతో సైబర్ నేరాలకు తెర తీసే వారు ఎక్కువ అయ్యారు. వారు ఏకంగా ఎమ్మెల్యే స్థాయి వారినే తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో బెదిరిస్తున్నారు. వారినే తమ దారిలోకి తెచ్చుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న మీదట క్రైమ్ సినిమా మూవీని తలపించేలా ఘటనలు జరుగుతున్నాయి. క్లైమాక్స్ షరా మామూలుగా దోషులు కటకటాలు లెక్కబెట్టడంతో ముగుస్తోంది. ఇక ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబాన్ని సైబర్ నేరగాళ్ళు బెదిరించి కోట్లు దోచుకున్న ఘటన వెలుగు చూసింది.

బ్లాక్ మెయిల్ చేసి మరీ :

కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ని సైబర్ నేరగాళ్ళు తాజాగా బెదిరించారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లుగా కూడా హడావుడి చేశారు. అలా ఒక కోటీ డెబ్బై లక్షల రూపాయలను ఆయన నుంచి వసూలు చేశారు. అయితే దీని మీద సదరు ఎమ్మెల్యే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు లోతైన దర్యాప్తు చేసి ఏడుగురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెటారు. చిత్రమేంటి అంటే నిందితులలో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్ సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నారు.

స్కెచ్ గీస్తున్నారు :

సైబర్ నేరగాళ్ళు తమ రూట్ మార్చారు. డబ్బున్న వారి కుటుంబాలను టార్గెట్ గా చేసుకుంటున్నారు. వారి విషయాలను అన్నీ తెలుసుకుని తమ తెలివి తేటలతో బోల్తా కొట్టిస్తున్నారు. ఏఐ సాయంతో సీబీఐ ఈడీ వ్యవస్థలను కూడా ముందుకు తెస్తున్నారు. అలాగే సమయానుకూలంగా కోర్టులను వారే చెబుతున్నారు. న్యాయమూర్తులు పోలీసులు ఇలా అవతారాలను ఎత్తుతూ బెదరగొడుతూ డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు ఈ సొమ్ము కట్టకపోతే అవుట్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచేస్తున్నారు. దీంతో గుండె బేజారు అయిన వారు అంతా బాబోయ్ ఇదేమి బాధ అని ఈ సైబర్ నేరస్థులు ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లించుకుంటున్నారు. ఆ తరువాత విషయం తాపీగా తెలుసుకుని సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడుతోంది.

బోల్తా పడిపోతారు :

డిజిటల్ అరెస్ట్ అంటే ఎంతటి వారికి అయినా గుండె పగిలిపోతుంది. పైగా సైబర్ నేరగాళ్ళు వేసే స్కెచ్ ఆ లెవెల్ లో ఉంటుంది. వారు తెర పైకి అన్ని వ్యవస్థలను ఒక్కసారిగా దించేస్తూ మీ పని సరి అని బెదిరిస్తే ఇక మహామహులు అయినా తబ్బిబ్బు అయి బోల్తా పడిపోతారు. ఇపుడు దేశంలో అదే జరుగుతోంది. అయితే ఈ సైబర్ నేరగాళ్ళు ఒక్కో చోట ఒక్కో కేసులో ఒక్కో విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. దాంతో ఎవరేమిటి అన్నది తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. దీని మీద సైబర్ పోలీసులు యంత్రాంగం మరింతగా అవగాహన కల్పించాల్సి ఉంది. లేకపోతే ఈ అరెస్టులతో మాత్రం ఇవి ఆగేట్టు అయితే లేవని అంటున్నారు.

Tags:    

Similar News