తమిళనాడు సెంటిమెంట్...రాష్ట్రపతి కూడా అవుతారా ?

దేశానికి కొత్త ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక అయ్యారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన నెగ్గడం విశేషం.;

Update: 2025-09-09 17:50 GMT

దేశానికి కొత్త ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక అయ్యారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన నెగ్గడం విశేషం. ఎందుకంటే కటా కటీ బొటా బొటీగా నెగ్గేలా చూస్తామని ఇండియా కూటమి పెద్దలు భావించారు. తమ కూటమి విజయం సాధిస్తుందని వారు బరిలోకి దిగలేదు. కానీ ఎన్డీయే కూటమి కూటమికి చుక్కలు చూపించాలని అనుకున్నారు. తీరా చూస్తే లెక్కలు మారిపోయాయి. ఏకంగా 150కి పైగా ఓట్ల భారీ మెజారిటీ దక్కింది. ఇటు అవుతుందనుకున్న క్రాస్ అటు తిరిగి మొత్తం తిరకాసు అయింది.

తమిళనాడు నుంచి మూడవ వారు :

ఇదిలా ఉంటే కొత్త ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి మూడో ఉప రాష్ట్రపతిగా చరిత్రకు ఎక్కారు. ఆయన కంటే ముందు తొలి ఉప రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పనిచేశారు. ఆయన 1952 నుంచి 1962 వరకూ రెండు సార్లు ఆ అత్యున్నత పదవిలో ఉన్నారు. ఆ తరువాత ఆయన దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఇక ఆయన తరువాత రామస్వామి వెంకటరామన్ 1984లో దేశానికి ఉప రాష్ట్రపతిగా చేశారు. ఇక ఆయన తన పదవీ కాలం మధ్యలో ఉండగానే 1987లో దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అంటే తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతులు అయిన ఆ ఇద్దరూ ఆ పదవి నుంచి నేరుగా ప్రమోషన్లు అందుకుని రాష్ట్రపతులు అయ్యారన్న మాట. మరి అదే సెంటిమెంట్ రాధాకృష్ణన్ కి కనుక అచ్చి వస్తే కనుక ఆయనను కూడా రాష్ట్రపతి పీఠం మీద చూడవచ్చా అన్న చర్చ అయితే సాగుతోంది.

అంది వచ్చిన పదవులు :

ఇక రాధాక్రిష్ణన్ కి రాజ్యాంగ పదవులు చూస్తే అలా అంది వచ్చాయని చెప్పాలి. ఆయన జార్ఖండ్ గవర్నర్ గా తెలంగాణా గవర్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసారు ఇపుడు దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్నారు. దాంతో ఆయనకు ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉందని అంటున్నారు. ఇపుడు ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్న ఆయనకు రానున్న రోజులు ఇంకా కలిసి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరో రెండేళ్ళలో :

ఇక చూస్తే దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు రెండేళ్ళలో ఉన్నాయి. అంటే 2027లో అన్న మాట. ఈ లోగా రాధాకృష్ణన్ రెండేళ్ళ పాటు ఉప రాష్ట్రపతి పదవిని పూర్తి చేస్తారు అని అంటున్నారు. మరోసారి దక్షిణాది అన్న అంశం కనుక బలంగా మారితే ఇదే రాధాక్రిష్ణన్ కి రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల ఓటింగ్ ఉప రాష్ట్రపతి పదవికి ఎంతగానో ఉపయోగపడింది. బీజేపీ కూడా సౌత్ ఇండియా మీద ఫోకస్ పెడుతోంది. దాంతో రాధాకృష్ణన్ కి రాష్ట్రపతి చాన్స్ ఉందా అన్న చర్చ మొదలైంది. పైగా ఆయన ఓబీసీ వర్గానికి చెందిన వారు కావడం కూడా రేపటి రోజున ఆశలను పెంచుతున్నాయని అంటున్నారు. ఎనీ హౌ ఆల్ ది బెస్ట్ రాధాక్రిష్ణన్ జీ అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News