బిగ్ డౌట్: కార్పొరేషన్ల సొమ్ము దారి మళ్లుతోందా ..!
రాష్ట్ర ప్రభుత్వాలకు పథకాలు అమలు చేయడం పెద్ద ప్రయాస. కానీ, తప్పదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం.. ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి.;
రాష్ట్ర ప్రభుత్వాలకు పథకాలు అమలు చేయడం పెద్ద ప్రయాస. కానీ, తప్పదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం.. ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. ఒకవేళ అమలు చేయకపోతే.. ప్రజలు ఎక్కడ బాధిస్తారోనన్న బెంగ కూడా వెంటాడుతుంది. ఇప్పుడు.. అలాంటి సమస్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు సంసిద్ధులై.. నగదును పంపిణీ చేస్తున్నాయి.
అయితే.. ఈ నిధులు అంత తేలికగా అయితే రావుకదా!. లెక్క పత్రం ఉండాల్సిందే. కేంద్రం పెద్దగా ఏమీ ఇవ్వడం లేదు. ఇచ్చినా లెక్కలు చెప్పాలి. ఇలా.. సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా సొమ్ములు వెచ్చే పరిస్థి తి లేకపోవడంతో ప్రభుత్వం కార్పొరేషన్లకు కేటాయించిన సొమ్ములను పథకాలకు మళ్లిస్తోందన్న చర్చ సాగుతోంది. కొన్నాళ్ల కిందట తెలంగాణలో కూడా.. ఇదే తరహా చర్చ వచ్చింది. ఇప్పుడు ఏపీలో మరోసారి కార్పొరేషన్లకు చెందిన సొమ్ములను ఉచిత పథకాలకు వెచ్చించారన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి అన్నదాత సుఖీభవ నుంచే ఈ చర్చ సాగడం ప్రారంభమైంది. అప్పట్లోనే నిధులు చాలక.. ఇతర కార్పొరేషన్లకు కేటాయించిన సొమ్ములను సంక్షేమ పథకాలకు మళ్లించారని తెలిసింది. తాజాగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. దీనికింద.. ఆటో డ్రైవర్లకు రూ.15000 చొప్పన పంపిణీ చేశారు. అయితే.. వారికి వచ్చిన నిధులకు సంబంధించిన మెసేజ్‌లో కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ కు సంబంధించిన నిధులు అని ఉండడం అవాక్కయ్యేలా చేసింది.
ఏంటి నష్టం..?
అంటే.. కార్పొరేషన్‌ల కోసం కేటాయించిన సొమ్మును ఆటో కార్మికులకు ఇచ్చారన్నది సుస్పష్టం. అయి తే.. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ల ద్వారా అయినా.. పేదలకు, లబ్ధి దారులకే కదా.. నిధులు ఇవ్వాలి.. ఇప్పుడు అదే పని చేశామని.. ఓ మంత్రి చూచాయగా వ్యాఖ్యానించారు. కానీ.. కార్పొరేషన్లు ఒకవైపు నిధుల్లేక కార్యక్రమాలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతోందని.. కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడే ఇటీవల వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారి నిధులను వాడేయడం.. దీనికి సంబంధించి ఫోన్లకు సందేశాలు రావడంతో సర్కారుకు ఇరకాటమనే చెప్పాలి.