కాంగ్రెస్ పుంజుకుంటే మొదటి దెబ్బ వైసీపీకే !
ఇక దక్షిణాదిన చూస్తే కర్ణాటకలో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి.;
ఏపీ మీద కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా పాతిక మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతే కాదు ఇద్దరు సీనియర్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకున్నారు వైఎస్సార్ వారసత్వాన్ని తమ వైపే అని చెప్పుకోవడానికి గట్టిగా క్లెయిం చేయడానికి షర్మిలను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ వ్యూహమేంటో తెలుస్తోంది. ఏపీలో తమ బలాన్ని పునరుద్ధరించుకోవడానికి కాంగ్రెస్ చాలా ఎత్తులతోనే ముందుకు వస్తోంది అని అంటున్నారు.
మారుతున్న వాతావరణం :
దేశంలో చూస్తే రాజకీయ వాతావరణం నెమ్మదిగా మారుతోంది. బీజేపీ మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. అంటే ఆ పార్టీ పట్ల జనంలో అసంతృప్తి పెరుగుతోంది అని అర్ధం. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ వంటి చోట్ల కాంగ్రెస్ దాని మిత్రపక్షం ఎస్పీ పుంజుకోవడం ద్వారా బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూరుస్తున్నారు. బీహార్ లో సైతం అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒక పెర్ఫెక్ట్ పిక్చర్ అయితే రావచ్చు. అక్కడ కనుక ఇండియా కూటమి గెలిస్తే దేశంలో రెండు పెద్ద రాష్ట్రాల్లో ఇండియా కూటమి పాగా వేసినట్లు అవుతుంది. దాని పరిణామాలు పర్యవసానాలు కూడా ఇతర రాష్ట్రాల మీద కచ్చితంగా ఉంటాయి.
దక్షిణాదిన బలంగానే :
ఇక దక్షిణాదిన చూస్తే కర్ణాటకలో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేతో కలసి కాంగ్రెస్ కూటమిగా ముందుకు సాగుతోంది. మరోసారి కనుక డీఎంకే అక్కడ అధికారం చేపడితే మాత్రం ఏపీ మీద దాని ప్రభావం కచ్చితంగా ఉంది. కేరళలలో అయితే ఇండియా కూటమిని బలపరచే వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. రెండు సార్లు ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది కాబట్టి 2027లో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే దక్షిణాదిన ఒక్క ఏపీ తప్ప అంతటా కాంగ్రెస్ ఉన్నట్లే. ఈ క్రమంలో జాతీయ స్థాయి రాజకీయ వాతావరణంతో పాటు దక్షిణాదిన మారుతున్న పరిస్థితులు కచ్చితంగా ఏపీ మీద ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.
ఏపీలో కాంగ్రెస్ కార్యాచరణ :
ఇక కాంగ్రెస్ ఏపీలో తన కార్యాచరణను కచ్చితంగా అమలు చేయాలనుకుంటోంది. 2029 నాటికి అధికారంలోకి వస్తామన్న ఆలోచన కానీ ఆశలు కానీ ఆ పార్టీకి అయితే లేవు. కానీ వైసీపీని పూర్తిగా బలహీనం చేసి ఆ ప్లేస్ లోకి తాము వస్తే కనుక 2034 ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని ముందుకు సాగవచ్చు అన్నదే కాంగ్రెస్ పెద్దల మాస్టర్ ప్లాన్ గా ఉంది. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్న ముస్లిం మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బలమైన రెడ్డి సామాజిక వర్గం ఇపుడు వైసీపీతో అయితే పూర్తి సంతృప్తిగా ఉన్నారా అన్నదే ప్రశ్నగా ఉంది.
బీజేపీతో పరోక్షంగా :
వైసీపీ బీజేపీని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో ఉన్నా కూడా వైసీపీ దూకుడు చేయడం లేదు అన్న చర్చ ఉంది. లోపాయికారీగా బీజేపీతో మితృత్వం నెరుపుతున్నారు అన్న ప్రచారం ఉండనే ఉంది. దాని వల్ల వైసీపీకి వ్యక్తిగతంగా ఏమి లాభంలో తెలియదు కానీ ఒక పార్టీగా బలమైన ఓటు బ్యాంక్ కి చిల్లు పడుతుందనే అంటున్నారు. ఇక జాతీయ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసి ఉన్నత పదవులు అందుకున్న రెడ్లు వైసీపీలో ఇమడలేకపోతున్నారు అన్నది కూడా ఉందని చెబుతున్నారు.
కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగితే :
ఏపీలో ఇక మీదట క్షత్ర స్థాయిలో ముమ్మరంగా పోరాటాలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీనియర్లను రంగంలోకి దించుతోంది. రానున్న రోజులలో ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీ ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో తమ రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళనలో ఉన్న బలమైన సామాజిక వర్గం కానీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అది కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున లాభిస్తుంది అని అంటున్నారు. అదే సమయంలో అంతకు అంతా వైసీపీ నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే వామపక్షాలు కాంగ్రెస్ కలసి ఒక బలమైన ఫోర్స్ గా మారితే వైసీపీ ప్రతిపక్ష స్థానానికి కూడా ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు.