ఇందిరాగాంధీ చేసిన పనే రాహుల్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 ఏళ్ళు. మరో పదేళ్ళలో 150 ఏళ్ళు పూర్తి చేసుకుని ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 ఏళ్ళు. మరో పదేళ్ళలో 150 ఏళ్ళు పూర్తి చేసుకుని ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది. ఎంతో ప్రజాస్వామిక లక్షణాలతో కాంగ్రెస్ ఏర్పాటు అయింది. ఉద్యమ సంస్థగా కాంగ్రెస్ తొలి అడుగులు వేసింది. అందులో పనిచేసిన వారు ఎందరో ఉద్ధండులు కాంగ్రెస్ కి కొత్త దారులు చూపించారు. కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికల నుంచి అన్నీ ప్రజాస్వామిక విధానంలో సాగుతూ వస్తున్నాయి. ఇక నెహ్రూ టైం లో కాంగ్రెస్ కేంద్రీకృతమైన అధికారాలతో నడవడం ఆరంభం అయింది. అది కాస్తా శ్రీమతి ఇందిరాగాంధీ చేతికి పగ్గాలు వచ్చాక మరింత పట్టు బిగించింది. ఇందిరాగాంధీ అయితే పార్టీ మొత్తాన్ని శాసించారు. ముఖ్యమంత్రులుగా ఎవరు ఉన్నా కాంగ్రెస్ పెద్దల దయా దాక్షిణ్యాలు ఉన్నంతవరకే కొనసాగేవారు. ఏ మాత్రం వారు తల విదిలించినా లేక అలాంటి సంకేతాలు కనిపించినా తప్పించేసేవారు. మాజీని చేసేవారు.
సీఎంలను మార్చడమే :
కాంగ్రెస్ ని మెచ్చి జనాలు పట్టం కడితే సీఎంలను మార్చడం ద్వారా ఆ పార్టీ జనాదరణను కోల్పోతూ వచ్చింది. ఇది చరిత్రలో పదిలంగా ఉన్న విషయం. ఎక్కడి దాకానో ఎందుకు ఉమ్మడి ఏపీలో 1978 నుంచి 1983 మధ్యలో ఏకంగా నలుగురు సీఎంలను మార్చేశారు. మొదట చెన్నారెడ్డి, తరువాత అంజయ్య, ఆ మీదట భవనం వెంకటరామ్, చివరిలో కోట్ల విజయభాస్కరరెడ్డిలను తెచ్చి కాంగ్రెస్ జనంలో అప్రతిష్ట మూటకట్టుకుంది. అందుకే 1983లో టీడీపీని జనాలు ఎన్నుకున్నారు.
అదే కుర్చీలాట :
అయినా సరే కాంగ్రెస్ వైఖరి మారలేదు. 1989లో అధికారం అప్పగించగానే చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరెడ్డిలను సీఎంలుగా చేసి తమ మార్క్ చాటుకున్నారు. ఫలితంగా మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఒక్క వైఎస్సార్ కి మినహాయింపు ఇచ్చారు. కానీ 2009లో ఆయన పోయాక రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా సీఎంలను మార్చేశారు. కిరణ్ ని కూడా మార్చి నాలుగో సీఎం ని తెద్దామని చూశారు అన్న ప్రచారం కూడా సాగింది.
ఒకే ఒక్క మాటతో :
ఇక తాజాగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సీఎం ని మార్చేసింది. ఆయన ఏమైనా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా అంటే లేదు, పాలనలో లోపాలు ఉన్నాయా అంటే అదీ కాదు, సడెన్ గా ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ మీరు రాజీనామా చేయండి అని ఒకే ఒక్క మాటతో కుర్చీని కదిపేశారు అని ప్రచారం సాగింది. దానికి కారణం తెర వెనక ఒప్పందం అని అంటున్నారు. డీకే సిద్దరామయ్య కి అధికారం వాటా కోసం ఇలా చేశారు అని చెబుతున్నారు. పార్టీ పరంగా ఒప్పందాలు వ్యవహారాలు ఏవైనా కావచ్చు కానీ జనాలకు అవి అవసరం లేవు కదా. ఒక ప్రభుత్వం అయిదేళ్ళ పాటు సుస్థిరంగా ఒకే నాయకత్వంలో పనిచేస్తే అందే ఫలితాలు వేరు అని జనాలు భావిస్తారు. పైగా సిద్ధరామయ్య అనుభవం తక్కువ కాదు, మంచి పాలనా దక్షుడిగా పేరు గడించారు. జనంలో కూడా చక్కని పేరు ఉంది. అలాంటి నేతను మార్చేయడంతో జనంలో అయితే చర్చ సాగుతోంది అని అంటున్నారు.
కేంద్రీకృత రాజకీయాలు :
దేశంలో రాజకీయం మారుతోంది. ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. అయినా సరే ఢిల్లీ కేంద్రంగా శాసిస్తామని ఈ రోజుకీ కాంగ్రెస్ ఆలోచించడం ఆ పార్టీకే ఇబ్బందిని కలిగిస్తుందని అంటున్నారు. కేరళలో కాంగ్రెస్ గెలిచిన తరువాత కొత్త సీఎం ని ఎంపిక చేయడానికి వారం పది రోజుల పాటు జాప్యం చేయడం అంటే కాంగ్రెస్ తీరు ఎక్కడా మార్చుకోలేదని అంటున్నారు. దీనిని చూసి మిగిలిన రాష్ట్రాలలో కూడా సీఎంని మార్చమని కోరుతారు. ఆ విధంగా కాంగ్రెస్ పెద్దలే చాన్స్ ఇచ్చినట్లు అవుతోందని అంటున్నారు. ఇందిరాగాంధీ కాలం వేరు ఇప్పటి కాలం వేరు, కాంగ్రెస్ ని జనం పార్టీగా మార్చడంతో పాటు వికేంద్రీకరణ విధానాలు అమలు చేయడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పునరుత్తేజం పొందగలదని అంటున్నారు.