కేరాఫ్ అక్బర్ రోడ్డు...కాంగ్రెస్ సెంటిమెంట్ మీద బీజేపీ చెలగాటం
కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీలో ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంది. అదే 24 అక్బర్ రోడ్డు. అక్కడ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం ఉంటూ వచ్చింది.;
కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీలో ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంది. అదే 24 అక్బర్ రోడ్డు. అక్కడ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం ఉంటూ వచ్చింది. ఏకంగా 48 ఏళ్ళ పాటు ఇక్కడే కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను నిర్వహించింది. దేశాన్ని పార్టీని రాజకీయాలను శాసించింది. అయితే ఇపుడు ఈ ఆఫీసుని ఖాళీ చేయమని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధినాయకత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ శనివారం అంటే మార్చి 28వ తేదీలోగా ఖాళీ చేయాలని డెడ్ లైన్ పెట్టింది.
కొత్త ఆఫీసులోకి షిఫ్ట్ :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ కాంగ్రెస్‌కు కొత్త ప్రధాన కార్యాలయంలోకి షిఫ్ట్ అయింది. అయినా సరే అక్బర్ రోడ్ బంగ్లాను ఎందుకు నిలుపుకోవాలనుకుంటోంది అంటే అది సెంటిమెంట్ తో కూడుకున్నది అని అంటున్నారు. అయితే ఈ ఆఫీసుని ఖాళీ చేయమని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ కీలక నేతలు విమర్శిస్తున్నారు. తాము ఖాళీ చేసేది లేదని అవసరమైతే న్యాయపరంగా చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు.
వారసత్వంగానే :
ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీస్ తమకు ఘనమైన వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ అయితే కాంగ్రెస్ అధినాయకత్వానికి నోటీసులు ఇచ్చింది. 4, అక్బర్ రోడ్డుని. అలగే 5,రైసినా రోడ్‌లోని బంగ్లాలను శనివారం లోగా ఖాళీ చేయాలని ప్రధాన ప్రతిపక్షాన్ని కోరింది. అక్బర్ రోడ్ ప్రాంగణంలో గత 48 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా ఉండగా రైసినా రోడ్ బంగ్లాలో జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యాలయం నడుస్తోంది. అయితే ఐటీఓ సమీపంలోని కోట్లా మార్గ్‌లో కాంగ్రెస్ తన కొత్త ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ పేరుతో ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ పాత భవనాలు ఖాళీ చేయాలని కేంద్రం కోరుతోంది.
అద్దె చెల్లిస్తున్నామని :
అయితే తాము ఈ రెండు బంగళాలో ఊరికే ఉండడం లేదని వాటికి మార్కెట్ ధరలకే అద్దె చెల్లిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఆ బంగళాలను తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల పేర్ల మీద కేటాయించాలని కోరినా అలా కూడా కేంద్రం చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండి పడుతున్నారు.
బీజేపీకి ఒక నీతి :
ఇదిలా ఉంటే ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాలో బీజేపీ నేతలు కూడా ఉంటున్నారని వారిని ఖాళీ చేయమని అడగడం లేదు కదా అని కాంగ్రెస్ నేతలు కొత్త పాయింట్ తీస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి, కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ సహా అనేక మంది రాజకీయ నాయకులు ప్రభుత్వ బంగ్లాలలోనే నివసిస్తున్నారు అని గుర్తు చేశారు. కేవలం కాంగ్రెస్ వద్ద ఉన్న ఈ రెండు బంగ్లాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఆ బంగళాలతో కాంగ్రెస్ :
అవి కేవలం బంగళాలు మాత్రమే కావని వాటితో కాంగ్రెస్ కి సెంటిమెంట్ ఉందని ఒక చరిత్ర ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 అక్బర్ రోడ్డులోని ప్రధాన కార్యాలయానికి కాంగ్రెస్ చరిత్రతో సంబంధం ఉందని చెబుతున్నారు. దాని వల్లనే ఈ బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తి లేదని అంటున్నారు. దీని మీద తాము న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. అయితే కాంగ్రెస్ ఇప్పటికే కొత్త పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకుందని మరి వారికి పాత ఆఫీసులతో సంబంధం ఏంటని బీజేపీ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ పునరుజ్జీవం :
కాంగ్రెస్ కష్టకాలంలో ఈ బంగ్లా నిలిచి మళ్ళీ పునరుజ్జీవం కలిగించింది అని అంటున్నారు. 1977 ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత ఏకంగా జాతీయ స్థాయిలో పార్టీ చీలిపోయింది. ఇందిరా గాంధీ ఒక వర్గానికి నాయకత్వం వహించారు. అలా కాంగ్రెస్ కి ఒక ఆఫీసు నాడు అత్యవసరం అయింది. ఆ సమయంలో ఇందిరా గాంధీకి అత్యంత విధేయుడైన రాజ్యసభ ఎంపీ జి. వెంకటస్వామి తన అక్బర్ రోడ్ బంగ్లాను పార్టీ కోసం అందించారు. ఈ బంగ్లా కాంగ్రెస్ అద్భుతమైన పునరుజ్జీవనానికి సాక్ష్యంగా నిలిచింది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలమంతా ఇది కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా కొనసాగింది. అంతే కాదు 1977లో దారుణంగా ఓడిన ఇందిరా గాంధీ 1980 లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించినది కూడా ఈ భవనం నుండే కావడం విశేషం.