ఆ తప్పే చేస్తే... బీహారూ దక్కదు రాహుల్!
జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లోనూ ఫరూక్ అబ్దుల్లా పార్టీతో పొత్తుకు రెడీ కావాల్సిన పార్టీ.. చేతులు ముడుచుకుంది.;
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకసారి చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేయడం సరికాదని అంటారు. కానీ, అదేంటో.. అతి ప్రాచీన పార్టీగా.. ఉద్ధండులను దేశానికి అందించిన పార్టీగా పేరొందిన కాంగ్రెస్ మాత్రం తప్పులపై తప్పులు చేస్తూనే ఉంది. ఫలితంగా రాష్ట్రాలను కూడా చేజార్చుకుంటూనే ఉంది. మరి ఈ తప్పులకు ఇప్పుడైనా చెక్ పెడతారా? ఇకనైనా బీహార్‌లో పుంజుకుం టారా? అనేది చూడాలి. ఈ క్రమంలో అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ తప్పులు చేసి.. చేతులు కాల్చుకున్న పరిణామాలు చూద్దాం..
1) ఢిల్లీలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్‌తో పొత్తు పెట్టుకునేందు ముందుగానే కాంగ్రెస్ చేతులు చాపాలని పార్టీ సీనియర్లు చెప్పారు. కానీ, రాహుల్ ససేమిరా అన్నారు. చివరకు చింతన్ శిబిర్‌లో కూడా.. ఏఐసీసీ చీఫ్.. మల్లికార్జున ఖర్గే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో సర్దుకు పోదాం.. కొంతలో కొంతైనా మేలు జరుగుతుందన్నారు. కానీ, వింటేనా.. చివరి దాకా సాగదీశారు. దీంతో ఆప్.. ఎదురు తిరిగింది. అసలు కాంగ్రెస్‌తో చేతులు కలిపేది లేదని తేల్చి చెప్పింది. ఫలితంగా అటు ఆప్ మాట ఎలా ఉన్నా.. దేశరాజధానిలో కాంగ్రెస్ అడ్రస్ కొలాప్స్ అయింది.
2) జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లోనూ ఫరూక్ అబ్దుల్లా పార్టీతో పొత్తుకు రెడీ కావాల్సిన పార్టీ.. చేతులు ముడుచుకుంది. ఫలితంగా ఆ పార్టీకి కూడా ఆగ్రహం పెల్లుబికి.. చివరకు కాంగ్రెస్‌ను తమ పొత్తు పార్టీ కాదని ప్రకటించి.. పరోక్షంగా బీజేపీకి వత్తాసు పలికింది. దీంతో కనీసంలో కనీసం 12 స్థానాలు దక్కుతాయని భావించిన కాంగ్రెస్ ఒకటి రెండుకు పరిమితమైంది.
3) హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లలోనూ.. ఇలానే చివరకు వరకు సాగదీసిన కాంగ్రెస్‌పార్టీ.. అక్కడ కూడా ప్రాభవం కోల్పోయింది. ఇలా.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ తప్పులపై తప్పు చేసింది.
ఇప్పుడు బీహార్ వంతు చూద్దాం..
ఇక, బీహార్ విషయానికి వస్తే.. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీ ఆర్జేడీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇంత వరకుబాగానే ఉంది. అనేకు ఉద్యమాలు, నిరసనలు, ఓట్ అధికార యాత్రలు అంటూ.. ప్రజల్లోకి వచ్చింది. దీంతో అంతో ఇంతో కాంగ్రెస్ బలం పుంజుకుంది. కానీ.. ఇదేసమయంలో పొత్తు ధర్మం పాటించండి! మహప్రభో అంటూ.. ఆర్జేడీ బతిమాలుతున్నా.. కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రెండు విషయాల్లో కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. దీంతో ఇక్కడ కూడా అదే తప్పు చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
1) సీట్ల పంపకం: పొత్తులో భాగంగా కాంగ్రెస్-ఆర్జేడీ-సీపీఎం-సీపీఐ సహా.. చిన్న చితకా పార్టీలు సీట్లు పంచుకోవాల్సి ఉంది. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చాలని కీలకమైన ఆర్జేడీ(లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి నేతృత్వం వహిస్తున్నారు) నేత కోరుతున్నారు. కానీ, కాంగ్రెస్ ఇప్పటికీ మౌనంగానే ఉంది. మరో వైపు.. షెడ్యూల్ కూడా ప్రకటించారు.
2) సీఎం సీటు: బీహార్‌లో పొత్తులు ఉన్నా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌లో అతి పెద్ద పార్టీ.. ఆర్జేడీనే. దీంతో సీఎం సీటు తమకే కావాలని తేజస్వి పట్టుబడుతున్నారు. పైగా.. ఇటీవల ఒపీనియన్ పోల్ చేసి సర్వేలోనూ.. నితీష్ తర్వాత.. సీఎం గా ప్రజలు కోరుతున్న నాయకుడు తేజస్వి అని తేలింది. అయితే.. ఈ విషయంలో ఏదో ఒక ప్రకటన చేసేందుకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదు. కానీ, తేజస్విమాత్రం తానే సీఎం అభ్యర్థినని.. తనను కాదంటే ఒంటరిపోరుకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారు. ఆర్జేడీకి మాత్రమే ఆయన సీఎం అని.. మహాఘట్ బంధన్‌కు కాదని అంటున్నారు. ఈ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌనంగానే ఉంది. ఇలా.. గతంలో చేసిన తప్పులతో ముప్పు తెచ్చుకున్న ప్రాచీన పార్టీ.. ఇక్కడైనా వాటిని సరిదిద్దుకోలేక పోతే.. కష్టమేనని చెబుతున్నారు పరిశీలకులు.