రాజకీయ పార్టీగా కాక్రోచ్ పార్టీ..?! ముగ్గురు అధికార ప్రతినిధుల నియామకం
సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లను దాటి రోడ్లపైకి వస్తోంది.
సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లను దాటి రోడ్లపైకి వస్తోంది. కేవలం మీమ్స్, సెటైర్లతోనే సరిపెట్టకుండా.. క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతుండటంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశంలోని విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం విజయవంతం చేయడంతోపాటు ప్రజలకు తమ పార్టీ విధానాలను తెలియజేయడానికి ముగ్గురు అధికార ప్రతినిధులను కాక్రోచ్ పార్టీ నియమించింది.
6న అభిజిత్ రాక
ఆందోళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ నెల 6న ఉదయం భారత్‌కు రానున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు అమెరికాలో ఉంటూ కాక్రోచ్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో సెటైరిక్ పేజీలు నడిపిన అభిజిత్.. నేరుగా క్షేత్రస్థాయి పోరాటానికి పిలుపునివ్వడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ నెల 6న ఢిల్లీకి వస్తున్న అభిజిత్ నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరతామని ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఈ నిరసన ప్రదర్శన జరగనుందని చెబుతున్నారు. ఎటువంటి రాజకీయ జెండాలు లేకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలని కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది.
రంగంలోకి ముగ్గురు అధికార ప్రతినిధులు
పార్టీని మరింత వ్యవస్థీకృతంగా మార్చే క్రమంలో భాగంగా తొలిసారిగా ముగ్గురు అధికార ప్రతినిధులను నియమించారు. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్, ఫిల్మ్ మేకర్ విజేత దహియా, అశుతోష్ రాంకా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి బుధవారం ఢిల్లీలో అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని వివరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురి నియామకంపై విస్తృత చర్చ జరుగుతోంది. జర్నలిస్టు సౌరవ్ దాస్ పరిశోధన జర్నలిజంలో విశేష అనుభవం గడించారు. సామాజిక అంశాలపై పోరాడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదేవిధంగా గత ఏడాది ఢిల్లీ కాలుష్యంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకున్న ఫిల్మ్ మేకర్ విజయ్ దహియాకు కాక్రోచ్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన ఉన్న అశుతోష్ ను కూడా అధికార ప్రతినిధిగా నియమించడం విశేషంగా చెబుతున్నారు.
ఇక ఈ నియామకాలతో కాక్రోచ్ పార్టీ నిజమైన రాజకీయ వేదికగా మారుతుందా? అన్న చర్చ ఎక్కువ అవుతోంది. కేవలం 15 రోజుల క్రితం పుట్టిన ఈ డిజిటల్ మూవ్‌మెంట్, ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతూ, స్పోక్స్ పర్సన్లను నియమిస్తుండటంతో.. భవిష్యత్తులో ఇదొక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాము కేవలం యువత సమస్యలపై పోరాడే వేదిక మాత్రమేనని, ప్రస్తుతానికి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
విపక్షాల వెనకుండి నడిపిస్తున్నాయా?
కాగా, కాక్రోచ్ పార్టీని విపక్షాలు వెనక నుంచి నడిపిస్తున్నట్లు అధికార వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ సంబంధాలు ఉండటాన్ని ఎత్తిచూపుతున్నాయి. అంతేకాకుండా సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వంటి వారు కాక్రోచ్ పార్టీకి మద్దతుగా నిలవడంతో అధికార పక్షం ఆరోపణలకు బలం చేకూరుతోందని అంటున్నారు. ఇక మిలియన్ల కొద్ది డిజిటల్ ఫాలోయింగ్ ఉన్న కాక్రోచ్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణ దక్కుతుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, ఢిల్లీలో జరిగే భౌతిక నిరసనకు ఎంతమంది విద్యార్థులు, యువత హాజరవుతారనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంటున్నారు.