పాలిటిక్స్ కు 'కాక్రోచ్' లు బలి? ఢిల్లీ ధర్నాతో అసలు గుట్టురట్టు..!!
నిజానికి సగటు విద్యావంతుడికి వచ్చే ప్రశ్న ఒక్కటే.. కేవలం ఒక మంత్రి రాజీనామా చేస్తే దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలు, అడ్మినిస్ట్రేటివ్ లొసుగులు రాత్రికి రాత్రే మారిపోతాయా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన వ్యంగ్య రాజకీయ ఉద్యమం 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ). ప్రారంభంలో వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ నెటిజన్లను ఆకట్టుకున్న ఈ ఉద్యమం.. మెల్లమెల్లగా పూర్తి రాజకీయ రంగు పులుముకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రతిపక్షాల అజెండాను భుజాన వేసుకుని నడుస్తున్నట్లు కనిపిస్తున్న సీజేపీ క్యాంపెయిన్ల వెనుక అసలు ఉద్దేశాలపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వంటి ప్రతిపక్షాల పరోక్ష మద్దతుతో, అభిజిత్ దీప్కే లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో తప్పులను ఎండగట్టడం కంటే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే ఏకైక పరిష్కారం అన్నట్లుగా సీజేపీ చేస్తున్న డిమాండ్లు పూర్తి రాజకీయ ప్రయోజనాల కోసమేననే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సమస్యను పక్కనబెట్టి, కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ 'కాక్రోచ్' పాలిటిక్స్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
నిజానికి సగటు విద్యావంతుడికి వచ్చే ప్రశ్న ఒక్కటే.. కేవలం ఒక మంత్రి రాజీనామా చేస్తే దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలు, అడ్మినిస్ట్రేటివ్ లొసుగులు రాత్రికి రాత్రే మారిపోతాయా? దీనికి ఈ సోషల్ మీడియా గ్రూపులు సమర్థన ఇస్తూ.. ఎక్కడో ఒకచోట ప్రక్షాళన మొదలుకావాలి కాబట్టి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రిని టార్గెట్ చేస్తున్నామని చెబుతున్నారు. కానీ, సమస్య మూలాలను చర్చించకుండా కేవలం విమర్శల కోసమే విమర్శలు చేస్తుండడంతో, ఈ 'కాక్రోచ్' బ్యాచ్ పట్ల రావాల్సిన విశ్వసనీయత పూర్తిగా తగ్గిపోతోందని అంటున్నారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వంలో త్వరలోనే జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనపై ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పనితీరు ప్రాతిపదికగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోబోయే పాలనా సంస్కరణల్లో భాగంగా.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించడమో, లేదా మరో శాఖకు మార్చడమో దాదాపు ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రధాని మోదీ తన నిర్ణయాల ప్రకారం కేంద్ర విద్యాశాఖలో మార్పులు చేపడితే ఆ తర్వాత కేవలం ప్రధాన్ రాజీనామా అజెండాతోనే పాలిటిక్స్ నడిపిన ఈ ఆన్‌లైన్ కాక్రోచ్‌లు ఏం చేస్తారు? అనేది పెద్ద ప్రశ్న అంటున్నారు.
అసలు సమస్యల పరిష్కారం కోసం కాకుండా, కేవలం ఒక వ్యక్తిగత టార్గెట్‌తో నడిచే నెగెటివ్ క్యాంపెయిన్‌లు ఎక్కువ కాలం నిలబడలేవని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని అంటున్నారు. ఒకవేళ మంత్రివర్గ మార్పుల తర్వాత కూడా వ్యవస్థలోని లోపాలపై నిర్మాణాత్మక సూచనలు చేయకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం మరో కొత్త నినాదాన్ని ఎత్తుకుంటే గనుక సామాన్య ప్రజల్లో వీరి పట్ల ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పూర్తిగా కనుమరుగవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.