విజయ్ సీక్రెట్ మీటింగ్స్... అసెంబ్లీలో విరుచుకుపడిన సీఎం స్టాలిన్!
అవును... కరూర్ దుర్ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెబుతున్న పలువురు టీవీకే కీలక నేతలు.. ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ తో భేటీ అయినట్లు కథనాలొస్తున్నాయి.;
తమిళనాడులోని కరూర్ లో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందగా.. సుమారు వంద మంది వరకూ గాయపడ్డారు! దీంతో... టీవీకే పార్టీకి చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో మరికొంతమంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు.. వారిని తాజాగా విజయ్ కలిసినట్లు తెలుస్తోంది!
అవును... కరూర్ దుర్ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెబుతున్న పలువురు టీవీకే కీలక నేతలు.. ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ తో భేటీ అయినట్లు కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా... తొక్కిసలాట ఘటన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ లు వేర్వేరుగా విజయ్ ను కలిసి, చర్చించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్ లను అరెస్టు చేయడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ విజయ్ ను కలిసారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.ఇదే సమయంలో.. ఈ భేటీ తర్వాత బుస్సీ ఆనంద్.. ఈసీఆర్ మార్గంగా పుదుచ్చేరి వెళ్లినట్లు చెబుతున్నారు. మరోవైపు దర్యాప్తును సీబీఐకు మార్చుతూ సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మృతుల కుటుంబాల విషయంలో మరో కీలక నిర్ణయం!
కరూర్ తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబాలకు తలా రూ.20 లక్షలు అందజేయనున్నట్టు టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున అందజేయనున్నారు! ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు నెల నెల రూ.5 వేల ఆర్థికసాయం అందజేస్తామని టీవీకే నిర్వాహకుడు, జేప్పియార్ సాంకేతిక కళాశాల అధినేత మరియ విల్సన్ తెలిపారు.
విజయ్ పై విరుచుకుపడిన సీఎం స్టాలిన్!:
కరూర్ లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటపై రాజకీయ వివాదం బుధవారం అసెంబ్లీ వరకు వ్యాపించింది. ఈ సమయంలో... ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత విజయ్ పై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... 41 మంది మృతి చెందిన విషాదానికి ఆయనను, ఆయన తమిళగ వెట్రీ కజగంను బాధ్యులుగా అభివర్ణించారు. ఈ క్రమంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా... టీవీకే షెడ్యూలింగ్ లో జరిగిన తీవ్ర లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఆరోపించిన స్టాలిన్... మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల పాటు కార్యక్రమం జరుగుతుందని పోలీసులకు చెప్పారని అన్నారు. విజయ్ మధ్యాహ్నం నాటికి వేదికకు చేరుకుంటారని పార్టీ వారు చెప్పడంతో పోలీసు మోహరింపును సవరించాల్సి వచ్చిందని తెలిపారు.
కానీ... విజయ్ మాత్రం చివరికి రాత్రి ఏడు గంటల తర్వాత వచ్చారనీ, దీంతో జనం గుమిగూడి అతని బస్సును కూడా నిలిపివేసారని ఆయన అన్నారు. ఇది ఈ తొక్కిసలాటకు గల ఒక ముఖ్యకారణమని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. తాగునీరు, మహిళలకు బాత్రూమ్ లు వంటి ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేయడంలోనూ విఫలమయ్యారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు.