గంటా.. అర గంటా కాదు ఓ రెండు గంటలు ఇస్తే చాలు.. సీఎం రమేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పార్టీ ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Update: 2026-06-15 06:11 GMT

పార్టీ ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరైనా బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తనకు రెండు గంటల సమయం చాలంటూ సీఎం రమేశ్ తాజాగా ప్రకటించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేయడం, వారి వెనుక సీఎం రమేశ్ పాత్ర ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం రమేశ్ స్పందన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు.

డబ్బులు ఇవ్వలేదు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఢిల్లీలో 20 మంది ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమై తృణమూల్ నుంచి తాము వేరుపడినట్లు ప్రకటించారు. అంతేకాకుండా నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే వీరిని ముందు బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయమై పార్టీ అధిష్టానం ఏపీకి చెందిన అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ కు బాధ్యత అప్పగించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

బెంగాల్ ఎంపీలతో తనకు చాలా కాలంగా ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, స్నేహబంధం ఉందని సీఎం రమేశ్ స్వయంగా చెప్పడంతో పై ప్రచారానికి ఊతమిస్తోందని అంటున్నారు. 2020లో జరిగిన తన కుమారుడి వివాహ వేడుకలకు టీఎంసీ ఎంపీలు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీంతో తృణమూల్ ఎంపీల తిరుగుబాటు ఎపిసోడ్ లో సీఎం రమేశ్ పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తృణమూల్ ఎంపీలను ఆకర్షించేందుకు తాము ఎలాంటి డబ్బు పంపిణీ చేయలేదని, పదవులు ఇస్తామంటూ ప్రలోభ పెట్టలేదని ఎంపీ రమేశ్ స్పష్టం చేశారు. దీంతొ ఆయన లాబీయింగ్ చేసిన విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరినైనా బీజేపీలోకి తెచ్చేందుకు తనకు కేవలం రెండు గంటలు చాలని రమేశ్ ధీమా వ్యక్తం చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది.

ఆపరేషన్ ఆకర్ష్ లో దిట్ట?

సీఎం రమేశ్ ఇలాంటి ఆపరేషన్లలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని అంటున్నారు. గతంలో అస్సాంకు చెందిన కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం వెనుక కూడా సీఎం రమేశ్ కీలక పాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక 'కానిస్టిట్యూషన్ క్లబ్' ఎన్నికల్లోనూ బీజేపీ సభ్యులను గెలిపించడానికి సీఎం రమేశ్ తీవ్రంగా శ్రమించి సక్సెస్ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి, ఎలాంటి నాయకుడినైనా కేవలం 2 గంటల్లో కాషాయ గూటికి చేర్చగలనంటూ సీఎం రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు బెంగాల్ రాజకీయాల్లో, ఇటు ఢిల్లీ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.

Tags:    

Similar News