జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గొడవల వేళ.. బావమరిది హరికృష్ణపై చంద్రబాబు ఎమోషన్

హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది.;

Update: 2025-08-29 10:25 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ రోజు ఓ భావోద్వేగమైన పోస్టు కనిపించింది. సాధారణంగా అధికారిక పనుల్లో బిజీబిజీగా ఉండే చంద్రబాబు.. ఈ రోజు చేసిన ఆ ట్వీట్ రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారింది. తన కుటుంబ సభ్యుడు, బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యుడిగానే కాకుండా అంతకుమించిన ఆత్మీయత, స్నేహాన్ని పంచిన మంచి మనిషిగా హరికృష్ణను కీర్తిస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. సినీ నటుడు, సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత బావమరిది అన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా హరికృష్ణను ఎదగనీయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొన్ని విమర్శలు చేస్తుంటారు. అదే సమయంలో హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో నందమూరి కుటుంబానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వియ్యంకుడు, బావమరిది అయిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మధ్య గ్యాప్ ఉందని కొంతకాలంగా చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ సినీ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మంత్రి లోకేశ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. దీంతో టీడీపీలో ఓ వర్గం జూనియర్పై గుర్రుగా ఉందని కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దగ్గుపాటి మాటలుగా చెబుతూ ఓ ఆడియో వైరల్ అయింది. ఈ ఆడియో తీవ్ర వివాదాస్పదమవగా, ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేపై సీరియస్ అయిందని టాక్ వినిపించింది. మరోవైపు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి వ్యతిరేకంగా ఎక్కడా, ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెబుతూ, తమ అభిమాన నటుడిని పార్టీ నుంచి దూరం చేసేలా కుట్ర చేస్తున్నారని జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో ఇదో తలనొప్పి వ్యవహారంగా మారిందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ రాజకీయ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహ జ్వాలను చల్లార్చేలా హరికృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని అంటున్నారు.

‘‘నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ.’’ అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

1995లో ఆగస్టు సంక్షోభంలో బావ చంద్రబాబు పక్షాన నిలబడిన హరికృష్ణ అప్పట్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే నిబంధనల ప్రకారం ఆరు నెలలో ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాల్సి ఉండగా, ఆయన శాసనసభలో అడుగుపెట్టేలా చంద్రబాబు సహకరించలేదన్న కారణంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా సొంతంగా ‘అన్నా తెలుగుదేశం’ అనే పార్టీని ప్రారంభించి గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొన్నాళ్లు బావకు దూరంగానే ఉంటూ వచ్చిన హరికృష్ణ ఆ తర్వాత తెలుగుదేశంలో పునఃప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో హరికృష్ణ తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చేపట్టిన రథయాత్రలో చైతన్య రథం నడిపి హరికృష్ణ పార్టీలో అందరి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ నాటి సంగతులను మళ్లీ గుర్తు చేసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News