ఫేస్ బుక్ ఫ్రెండ్ తో రిలేషన్.. నిద్రమాత్రలిచ్చి భర్తను లేపేసింది!

వివాహేతర సంబంధాలతో జరుగుతున్న హత్యలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Update: 2026-08-13 09:30 GMT

వివాహేతర సంబంధాలతో జరుగుతున్న హత్యలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నూరేళ్ల వివాహ బంధాన్ని, పవిత్రమైన దాంపత్య జీవితాన్ని తృణప్రాయంగా తెంచుకుంటూ, కేవలం క్షణికమైన ఆకర్షణ కోసం నిండు జీవితాలను బలి తీసుకుంటున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పీలేరు డిష్ కాలనీకి చెందిన మంగినేని వెంకటసుబ్రహ్మణ్యం (45) అనే వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడు చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచనలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిందితులు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారని ఎస్పీ ధీరజ్ వెల్లడించారు.

ఫేస్ బుక్ పరిచయంతో అనైతిక సంబంధం

ఈ ఘటనకు ప్రధానంగా నిందితుల మధ్య ఏర్పడిన పరిచయమే చర్చకు దారితీస్తోంది. నిందితురాలికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ఏర్పడిన వివాహేతర సంబంధమే దారుణానికి దారితీసిందని అంటున్నారు. తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించి, పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. నిద్రమాత్రలు కలిపిన ఆహారం తినిపించి, భర్త గాఢనిద్రలో ఉండగా ఇనుప రాడ్, గుండ్రాయితో తల పగులగొట్టి దారుణంగా అంతమొందించారని, అనంతరం ఆ మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. సాంకేతిక ఆధారాలతో ఈ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

ఈ ఘటన ఇటీవల పెరుగుతున్న నేర సంస్కృతికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇలాంటి నేరాలు వరుసగా వెలుగుచూడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న నేరాల శాతం గణనీయంగా పెరిగిందని అంటున్నారు. ఒక రిపోర్టు ప్రకారం ఏపీలో నమోదైన హత్యకేసుల్లో దాదాపు 58 శాతం వరకు కుటుంబ వివాదాలు, వివాహేతర సంబంధాల వల్ల జరిగినవేనని అంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. హత్యకు గురైన భర్తలలో అధిక శాతం భార్యల వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు.

కుటుంబ సంబంధాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ ధోరణులకు పలు కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువై కుటుంబ సంబంధాలు క్షీణిస్తున్నాయని అంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయాలు పెరగడం, అవి క్రమంగా అక్రమ సంబంధాలకు దారితీయడం ఒక ముఖ్య కారణంగా చెబుతున్నారు. బంధాల్లో ఉండే బాధ్యత, నమ్మకం కంటే క్షణికమైన ఆనందానికే ప్రాధాన్యతనివ్వడం వల్ల ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, వివాహేతర సంబంధాన్ని నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ ధోరణులు పెరగిపోవడానికి ఒక కారణంగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అదేసమయంలో ఆధునిక పోకడల వల్ల వివాహం అనేది ఒక పవిత్రమైన బంధంగా కాకుండా, కేవలం ఒప్పందంగా మారిపోయిందని, విలువల పట్ల గౌరవం తగ్గిపోయిందని విశ్లేషిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచన లేని నిర్ణయం మొత్తం కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తుందనే విషయాన్ని గుర్తిస్తేనే ఈ తరహా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News