చిన్న శ్రీను పార్టీ మారడం వెనక బొత్స....ఇదీ వ్యాపారం ?

గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రా రాజకీయాలను హీటెక్కిస్తున్న చిన్న శ్రీను పార్టీ మార్పు మీద రకరకాలైన కధనాలు వినిపిస్తున్నాయి.

Update: 2026-09-10 04:30 GMT

గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రా రాజకీయాలను హీటెక్కిస్తున్న చిన్న శ్రీను పార్టీ మార్పు మీద రకరకాలైన కధనాలు వినిపిస్తున్నాయి. మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీలో ఒక వెలుగు వెలిగారు, ఆయనకు దక్కినన్ని పదవులు ఎవరికీ దక్కలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భీమునిపట్నం అసెంబ్లీ వైసీపీ ఇంచార్జిగా, వైసీపీ బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇలా అనేక పదవులు అందుకున్న చిన్న శ్రీను సడెన్ గా చెప్పా చేయకుండా ఫ్యాన్ స్విచాఫ్ చేసి సైకిలెక్కేశారు. ఎంత రాజకీయం అనుకున్నా ఇదేమిటి ఇలా అని అంతా షాక్ కి గురి అయ్యారు. రాజకీయాల గురించి ఆ మాత్రం ఆసక్తి ఉన్న వారు అంతా ఈ రకంగా కూడా జంపింగ్స్ ఉంటాయా అని బుగ్గలు నొక్కుకున్నారు. ఎందుకంటే పదవులు అన్నీ అందుకుని కూడా పార్టీ గేట్ దాటేయడం అంటే నయా పాలిటిక్స్ కి నాంది అని అనుకున్న వారూ ఉన్నారు.

బొత్స నీడగా ఉంటూ :

ఇంతకీ చిన్న శ్రీను ఎవరు అంటే ఈ రోజుకీ విజయనగరం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడిగానే చెబుతారు. ఆయన పార్టీ మారారు అని వార్తలు రాసిన మీడియా కూడా బొత్స మేనల్లుడు అనే హైలెట్ చేసింది. అంటే కేరాఫ్ బొత్సగానే చిన్న శ్రీను మొత్తం రాజకీయం ముడిపడి ఉంది అన్న మాట. అలాంటిది చిన్న శ్రీను వేసే కొత్త అడుగులు బొత్సకు తెలియకుండా ఉంటాయా అన్నదే ఇపుడు విజయనగరం జిల్లా రాజకీయాలతో పాటు ఉత్తరాంధ్రా అంతటా ఒక్కటే చర్చగా ఉంది. ఇక బొత్సకు విధేయుడిగా ఉంటూ ఆయన మేనల్లుడిగా రాజకీయంగా చిన్న శ్రీను ఎంతగానో ఎదిగి ఒక రకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక ప్రముఖ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో బొత్స పేరున మొత్తం రాజకీయాలు చూసేది కూడా చిన్న శ్రీను అన్నది అందరికీ తెలిసిందే. తెర వెనక వ్యూహాలు బొత్సవి అయితే అమలు చేసేది చిన్న శ్రీను అని అంతా అంటారు. అంతలా బొత్స చిన్న శ్రీనుల బంధం ఉన్న వేళ సడెన్ గా చిన్న శ్రీను వైసీపీని వీడిపోతున్నారు అంటే పెద్దాయనకు కనీసం చిన్నపాటి మ్యాటర్ అయినా లీక్ కాకుండా ఉండదా అని డౌట్ పడుతున్న రాజకీయ జీవులు ఉన్నారు.

బొత్సకు కుడి భుజంగానే :

ఇక చిన్న శ్రీను అంటే బొత్సకు కుడి భుజం అని చెప్పుకుంటారు. బొత్స మాట జవదాటని వారు అని కూడా పేరుంది. బొత్స పూర్తిగా ప్రోత్సహించి జిల్లా రాజకీయాల్లో నిలబెట్టిన నేతగా చిన్న శ్రీను గురించి చెప్పుకుంటారు. ఒక విధంగా మామా అల్లుళ్ళ బంధం కంటే గురు శిష్యుల బంధం అంతకంటే తండ్రీ కొడుకుల బంధం గా కూడా వీరిద్దరిదీ చెప్పుకుంటారు. బొత్స చిన్న శ్రీనులను ఎవరూ వేరుగా చూడరు, విడదీసి మాట్లాడేది కూడా ఉండదు, అలాంటిది బొత్సని కాదని చిన్న శ్రీను వెళ్ళారు అంటే ఎక్కడో తేడా కొడుతోందని అంటున్న వారు కూడా ఉన్నారు.

ఒక్క మాట అనని బొత్స :

ఇక్కడ మరో తమాషా ఏంటి అంటే చిన్న శ్రీను పార్టీని వీడిపోయారు. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల ముందు. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుంది. ఒక వైపు అధినేత జగన్ అయితే ఎక్కడా ఏకగ్రీవాలు అన్నవి ఉండరాదు అని ఒకటికి పది సార్లు చెబుతున్న వేళ, అటూ ఇటూ కూటమి వైసీపీ ఎదురు బొదురుగా మోహరించి ఉన్న వేళ ఇంతటి సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో కాడె వదిలేసి చిన్న శ్రీను వెళ్ళిపోతే జిల్లా మొత్తం పార్టీ వ్యవహారాలు చూసే పెద్దాయన బొత్స ఒక్క మాట కూడా మేనల్లుడి ఫిరాయింపు గురించి అనకపోవడం మీద కూడా చర్చించుకుంటున్న వారూ ఉన్నారు. ఆయన్ని విశాఖలో మీడియా ఇదే విషయం మీద ప్రశ్నిస్తే జనరల్ గా కామెంట్ ఒకటి చేసి లైట్ తీసుకున్నారు. స్వార్ధం ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు అని ఒక్క ముక్కతో తేల్చేశారు. నిజానికి అంత చిన్న విషయంగా బొత్స ఇలా చెబుతూంటే వైసీపీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకపోతున్నాయని అంటున్నారు. ఎందుకంటే చిన్న శ్రీను పేరుకే కానీ ఆయన పెద్ద శ్రీనుగానే ఈ రోజున ఎదిగారు, అలాంటి నేత పార్టీ వీడితే బొత్స రియాక్షన్ మరీ ఇంత లైట్ గా ఉందేమిటి అని ఆలోచిస్తున్న వారూ ఉన్నారు.

మేనల్లుడు సైతం :

అంతే కాదు మేనల్లుడు చిన్న శ్రీను సైతం బొత్సను ఏమీ అనలేదు, తనకు మేనమామ అంటే గౌరవం ఉంది అని కూడా అన్నారు. ఇలా మామా అల్లుడు ఒక్క మాట కూడా ఎవరికి వారుగా అనుకోకపోవడంతోనే విజయనగరం జిల్లాలో ఒక చర్చ అయితే వేడిగా వాడిగా సాగుతోంది. ఇక్కడ తరచి చూస్తే మరిన్ని చిత్రాలు కనిపిస్తాయి. చిన్న శ్రీను టీడీపీలోకి వెళ్లారు, ఆయన అల్లుడు, చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర భర్త ప్రదీప్ వైసీపీలోనే ఉన్నారు. అంతే కాదు వియ్యంకుడు నెల్లిమర్ల వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కూడా వైసీపీలోనే ఉన్నారు. దాంతో ఇదేమి రాజకీయం అన్న చర్చ కూడా వస్తోంది. దీని మీదనే విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చిన్న శ్రీను టీడీపీ ప్రవేశం అంతా పెద్దాయన బొత్స కనుసన్నలలోనే సాగింది అన్నదే ఈ చర్చల సారాంశంగా ఉంది.

పార్టీ కాదు ఫ్యామిలీనే :

విజయనగరం జిల్లా రాజకీయాలను బొత్స ఫ్యామిలీ శాసిస్తోంది. ఇక్కడ పేరుకే పార్టీలు కానీ అంతకంటే ఎక్కువగా బొత్స ఫ్యామిలీ ముద్ర ఉంది. బొత్స వైసీపీ నాయకుడు అయినా ఆయన చెప్పిన వారికే టికెట్లు అన్నీ దక్కాయి. జిల్లా మొత్తం మీద బొత్స బంధువులు అనుచరులు అంతా కనిపిస్తారు, ఇక తెలుగుదేశంలో అశోక్ గజపతి రాజు ఉన్న టైం లో సంగతేమో కానీ ఇపుడు ఆ పార్టీలో కూడా తమకు పోటీ లేకుండా చూసుకోవాలన్న ముందు చూపుతోనే మేనల్లుడిని ఆ వైపుగా పంపించారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది అంటున్నారు. ఇలా చిన్న శ్రీను వ్యవహారం అంతా చూసిన వారు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు విజయనగరం జిల్లాలో పార్టీలతో సంబంధం లేకుండా బొత్స కుటుంబమే ఏలాలని అనుకుంటోందని అందుకే స్థానిక సంస్థల ఎన్నికలో కూడా చిన్న శ్రీను ఫ్యామిలీ నుంచే జిల్లా పరిషత్ చైర్మన్ ని నెగ్గేలా చేసేందుకు ఈ ప్లాన్ అని అంటున్నారు. అంతే కాదు వాళ్ల వ్యాపారాలు వ్యవహారాలు సాఫీగా సాగాలి అంటే ఇదే సరైన రాజకీయ వ్యూహం అని కూడా రెండు పార్టీలలో కూడా గుసగుసలు పోతున్నారుట. మరి పై స్థాయిలో అధినాయకత్వాలు ఈ రకమైన విషయాలను ఏ విధంగా చూస్తాయన్నదే ఇపుడు చర్చగా ఉంది.

Tags:    

Similar News