షికాగో ఆల్బమ్ పార్టీలో మారణ హోమం: నలుగురు మృతి
ఈ దారుణ ఘటన చికాగోలోని రివర్ నార్త్ ప్రాంతంలో ఉన్న ఒక రెస్టారెంట్ దగ్గర జరిగిన ఓ ఆల్బమ్ రిలీజ్ పార్టీ సమయంలో చోటుచేసుకుంది.;
అమెరికాలోని షికాగో నగరంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. షికాగో పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, మృతులలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
పార్టీలో మారణహోమం
ఈ దారుణ ఘటన చికాగోలోని రివర్ నార్త్ ప్రాంతంలో ఉన్న ఒక రెస్టారెంట్ దగ్గర జరిగిన ఓ ఆల్బమ్ రిలీజ్ పార్టీ సమయంలో చోటుచేసుకుంది. పార్టీకి సంబంధించిన లాంజ్‌లో ఉన్న వారిపై ఓ గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
- బాధితుల వివరాలు
కాల్పులకు గురైనవారిలో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మృతుల వయస్సు 21 నుంచి 32 సంవత్సరాల మధ్యగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తక్షణమే తరలించి చికిత్స అందిస్తున్నారు.
- దర్యాప్తు ప్రారంభం
పోలీసులు కేసును పరిశీలిస్తూ దుండగుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ దాడి కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.