చెవిరెడ్డి మీద ప్రశ్నల వర్షం.. రోటీన్ కు భిన్నమైన రియాక్షన్

ఏపీలో సంచలనంగా మారి.. రాజకీయంగా ప్రకంపనల్ని క్రియేట్ చేస్తున్న లిక్కర్ స్కాం విచారణ నాటకీయ పరిణామాల్ని తలపిస్తోంది.;

Update: 2025-07-02 05:13 GMT

ఏపీలో సంచలనంగా మారి.. రాజకీయంగా ప్రకంపనల్ని క్రియేట్ చేస్తున్న లిక్కర్ స్కాం విచారణ నాటకీయ పరిణామాల్ని తలపిస్తోంది. ఈ కుంభకోణంలో భాగం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్కాంలో కీలక భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలతో అరెస్టు అయిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధికారులు విచారించారు.

ఈ సందర్భంగా ప్రశ్నలను సంధించిన అధికారులపై చెవిరెడ్డి రోటీన్ కు భిన్నంగా రియాక్టు అయినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా కేసు ఏదైనా.. కుంభకోణం మరేదైనా ఆరోపణలతో అరెస్టు కావటం.. లేదంటే విచారణకు హాజరయ్యే వారు.. అధికారులు సంధించే ప్రశ్నలకు స్పందించే తీరు ఒకలా ఉంటుంది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం లేదంటే గుర్తు లేదు.. మర్చిపోయాను.. సంబంధం లేదంటూ చెప్పటం చూశాం.

అందుకు భిన్నంగా అధికారులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం తర్వాత.. వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ వర్గాలతో పాటు.. అధికార వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు విచారణను ఎదుర్కొనే రాజకీయ నేతల తీరుకు భిన్నంగా చెవిరెడ్డి తీరు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

మద్యం ముట్టని తనపై నిందలు వేస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. ఎదురు ప్రశ్నలు వేసినట్లుగా చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో భాగంగా అందిన డబ్బుల్ని ఎవరికి అందించారు? ఎక్కడెక్కడకు తీసుకెళ్లారు? అన్న ప్రశ్నలకు చెవిరెడ్డి భిన్నంగా రియాక్టు అయినట్లుగా తెలుస్తోంది. తనకు లిక్కర్ వాసనే పడదని.. దాని రుచి కూడా ఇప్పటివరకు చూడలేదని.. అలాంటిది వేల కోట్ల రూపాయిల స్కాంలో తనకు డబ్బులు ఎవరైనా.. ఎందుకు ఇస్తారు? అంటూ అధికారులనే ఉల్టా ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. తనను సంబంధం లేని వ్యవహారాల్లో అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. తనను తన కుటుంబాన్ని లిక్కర్ స్కాంలోకి దించుతున్నారని.. ఇది సరికాదన్న ఆయన.. అందుకు తగిన ఫలితాన్ని అధికారులు అనుభవిస్తారని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. దీంతో అధికారులు స్పందిస్తూ నోరు పెద్దది చేస్తే సరిపోదంటూ తాడేపల్లిలో మద్యం ముడుపులు దాచిన ఇంటికి పలుసందర్భాల్లో ఎందుకు వెళ్లారు? ప్రణయ్ ప్రకాష్ తో ఎందుకు భేటీ అయ్యారన్న ప్రశ్నకు చెవిరెడ్డి తనదైన శైలిలో స్పందించినట్లు చెబుతున్నారు. తమ పార్టీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లిలో ఉందని.. అందుకే తాను అక్కడికి వెళ్లినట్లుగా చెబుతూ.. ప్రణయ్ ప్రకాశ్ ఎవరో తనకు తెలీదని పేర్కొన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి చెవిరెడ్డి విచారణ మిగిలిన వారి విచారణకు భిన్నంగా సాగినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News