చంద్రబాబును గంగూలీతో పోల్చిన అర్నాబ్... తెరపైకి వైఎస్సార్ ప్రస్థావన!

ఇందులో భాగంగా... చంద్రబాబుని "కమ్‌ బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అంటూ పేర్కొన్నారు అర్నబ్.

Update: 2024-04-27 06:30 GMT

ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలో మరో రెండు వారాల తర్వాత ఏపీలోనూ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో... ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ - టీడీపీ - జనసేన నేతలతో పాటు.. ఒంటరిగా బరిలోకి దిగుతున్న వైసీపీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టిపెట్టాయి. ఈ సమయంలో చంద్రబాబు జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చారు!

అవును... సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో జాతీయ మీడియాతో చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి చంద్రబాబుపై ప్రశంసల జల్లులు కురిపించగా.. మరోపక్క చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ తో ఉన్న స్నేహాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ మోహన్ రెడ్డిలా ప్రతీకారం తీర్చుకునే సీఎంను చూడలేదని అన్నారు. ఇదే సమయంలో... జగన్ తన ప్రత్యర్థులలో ప్రతి ఒక్కరినీ బాధపెట్టాలని, దుర్భాషలాడాలని భావించే సైకోటిక్ మనిషని తీవ్ర విమర్శలు చేశారు. అయితే... ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆ విధంగా ఆలోచించకూడదని హితవు పలికారు!

ఇదే సమయంలో... తన కెరీర్‌ లో ఇప్పటి వరకు తనపై ఒక్క అవినీతి విమర్శ కూడా లేదని చెప్పుకున్న చంద్రబాబు... జగన్ కావాలని కట్టుకథలతో తనపై బురద జల్లారని వ్యాఖ్యానించడం గమనార్హం. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో కొర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు ప్రస్థావించారన్నమాట!

ఇదే క్రమంలో... వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యం గురించి స్పందించిన చంద్రబాబు... 80వ దశకంలో తామిద్దరం మంచి స్నేహుతులం అంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం... 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్యావరణాన్ని నాశనం చేశారని.. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజాస్వామ్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు.

అదేవిధంగా... రానున్న ఎన్నికల ఫలితాలపైనా జోస్యం చెప్పిన చంద్రబాబు... రెండు ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని అన్నారు. ఇదే క్రమంలో... అసెంబ్లీలో 160+, లోక్ సభ స్థానాల్లో 24+ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో... అర్నబ్ గోస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ప్రశంసల జల్లులు కురిపించారు.

ఇందులో భాగంగా... చంద్రబాబుని "కమ్‌ బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అంటూ పేర్కొన్నారు అర్నబ్. ఇదే సమయంలో... చంద్రబాబును ప్రత్యర్థులు నిరంతరం రాద్ధాంతం చేస్తుంటారు కానీ.. అతను కిందపడ్డ ప్రతిసారీ ఫీనిక్స్ లాగా లేస్తారని చెప్పిన గోస్వామి... చంద్రబాబు రాజకీయ ప్రయాణాన్ని క్రికెటర్ సౌరవ్ గంగూలీతో పోల్చారు.. అతను ప్రతిసారీ తన బ్యాటింగ్ టాలెంట్ తో పునరాగమనం చేస్తాడని వెల్లడించారు.

Tags:    

Similar News