ఎప్పుడూ రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతోనే తంటా! నాడు ఐవీఆర్, నేడు ఏబీవీ

అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిల భారత సర్వీసు అధికారులను ఎక్కువగా ప్రోత్సహిస్తారని చెబుతారు.;

Update: 2025-07-01 06:28 GMT

అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిల భారత సర్వీసు అధికారులను ఎక్కువగా ప్రోత్సహిస్తారని చెబుతారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ మాటలు కన్నా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాధాన్యమివ్వడంతోపాటు వారినే పరిపాలనలో ఎక్కువగా భాగస్వాములు చేస్తారని కూడా అంటుంటారు. అయితే అలా చంద్రబాబు ప్రోత్సాహం అందుకున్న అధికారులు రిటైర్ అయ్యాక ఆయనపైనే కారాలు మిరియాలు నూరుతుంటారని చర్చ జరుగుతోంది. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తీరుతో ఈ చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. గతంలో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు, ఇప్పుడు ఏబీవీ తీరుతో రిటైర్డ్ అధికారులకు చంద్రబాబుకు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఎక్కువగా రాజకీయం కంటే బ్యూరోక్రసీకే ప్రాధాన్యం ఉంటుంది. తనను తాను సీఈవోగా చెప్పుకునేందుకు ఇష్టపడే చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాధాన్యమిచ్చి, పార్టీ నేతలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా నష్టపోయానని గతంలో స్వయంగా చెప్పారు. అయితే ఆయన వద్ద అన్ని రకాలుగా ప్రోత్సాహం అందుకున్న అధికారులు రిటైర్ అయ్యాక చంద్రబాబుకే ఎదురు తిరుగుతుండటం చర్చకు తావిస్తోంది.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీ సర్వీసులో ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్నీతానై వ్యవహరించారని ప్రచారం ఉంది. ఈ కారణంగానే గత ప్రభుత్వంలో ఆయన కక్ష సాధింపులకు లోనయ్యారని అంటుంటారు. ఐదేళ్ల పాటు సర్వీసు కోల్పోవడమే కాకుండా, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు చంద్రబాబుతో సహచర్యమే కారణమని ఏబీవీపై విమర్శలు ఉన్నాయి. అయితే ఏబీ రిటైర్ అయ్యాక తనపై చంద్రబాబు అనుచరుడు అనే ముద్ర తొలగించుకోవాలని అనుకుంటున్నారో..? లేక నిజంగా ప్రజల పక్షాన పోరాడాలని భావిస్తున్నారో గానీ కొన్ని రోజులుగా ప్రభుత్వ తీరుపైన ముఖ్యంగా చంద్రబాబుపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

ఇక రెండు రోజుల క్రితం ఇద్దరు జర్నలిస్టులను ఉద్దేశించి ఏబీవీ చేసిన ట్వీట్ కూడా హాట్ టాపిక్ అయింది. తనకు టీడీపీ నుంచి మణులు, గనులు ఏవీ రాలేదని చెప్పడమే కాకుండా తనకు కనీస మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏబీవీ. చంద్రబాబు తనకు ఇచ్చిన పదవిని సైతం తీసుకోకుండా అలకపాన్పు ఎక్కిన ఏబీవీని సర్ది చెప్పే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఏబీవీ-చంద్రబాబు మధ్య గ్యాప్ పెరిగిపోతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి గతంలో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు నుంచి ఎదుర్కొన్నారు చంద్రబాబు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐవీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన రిటైర్ అయిన తర్వాత పార్టీ నేతలను కాదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మనుగా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు.

అయితే ఆ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఐవీఆర్ ఎదురుతిరిగారు. చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేయడంతోపాటు రాజధాని అమరావతిపైనా పలు వ్యాఖ్యలు చేసి చంద్రబాబు ప్రభుత్వానికి తీరని నష్టం చేకూర్చారని అంటుంటారు. చంద్రబాబు ఎంతో ప్రోత్సమించిన ఐవీఆర్ ఎదురు తిరగడం అప్పట్లో సంచలనం రేపింది. అదేవిధంగా చంద్రబాబు హయాంలో కీలక పదవులు అనుభవించిన ఐఏఎస్ లు అజయ్ కల్లం, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటివారు కూడా ఆయనను ఒకానొక సమయంలో తీవ్రంగా వ్యతిరేకించారని ప్రచారం ఉంది.

ఎల్వీ సుబ్రహ్మణ్యం వల్ల తన అధికారం పోయిందని చంద్రబాబు గతంలో విమర్శలు గుప్పించగా, అజయ్ కల్లం రిటైర్ అయ్యాక జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇలా చాలా మంది అఖిల భారత సర్వీసు అధికారులు రిటైర్ అయ్యాక సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మారడమే చర్చకు తావిస్తోంది. అయితే అందరి కన్నా ఎక్కువగా ఏబీవీ తీరుపైనే హాట్ డిబేట్ జరుగుతోంది. చంద్రబాబుపై ఏబీవీ విమర్శలు చేయడాన్ని ఎవరూ ఊహించలేదని అంటున్నారు. అయితే మంచి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా తనకు దక్కాల్సిన ప్రయోజనాలు ఆలస్యమయ్యాయన్న కారణమే ఆయనలో అసంతృప్తి రాజేస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి మధ్య చెలరేగే వివాదాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

Tags:    

Similar News