మారిన చంద్రబాబు వ్యూహం.. అందుకే 2029

టార్గెట్ 2029 అన్నట్లే తన నిర్ణయాలు ఉంటాయని ఆదివారం నాటి సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.;

Update: 2025-06-30 09:54 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ సవరించుకున్నారా? అన్న చర్చ జరుగుతోంది. విజన్ 2047 పేరుతో 25 ఏళ్ల సుదీర్ఘ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు 2029 టార్గెట్ తోనే పనిచేస్తున్నారని అంటున్నారు. ఆదివారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు 2029 లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు వెల్లడించారు. సాధారణంగా 25, 30 ఏళ్లు తానే సీఎం అన్నట్లు మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఈ ఐదేళ్ల తోపాటు మరో ఐదేళ్లు చాలు అన్నట్లుగా ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

టార్గెట్ 2029 అన్నట్లే తన నిర్ణయాలు ఉంటాయని ఆదివారం నాటి సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తమ ప్రభుత్వం మరో 25 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నారు. తమ పొత్తును ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని చెబుతున్నారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే చాలు అన్నట్లు మాట్లాడటమే అందరినీ ఆలోచనలకు గురిచేస్తోంది. ఎప్పుడూ సుదీర్ఘ లక్ష్యాలు నిర్దేశించుకుని మాట్లాడే చంద్రబాబేనా? ఇలా మాట్లాడుతుంది అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చంద్రబాబు తన టార్గెట్ సవరించుకోడానికి చాలా కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ 2020 పేరుతో పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 నిర్దేశించుకున్నారు. అయితే ఆయన వయసు దృష్ట్యా 25 ఏళ్లు లక్ష్యంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు 25 ఏళ్లు ప్రణాళిక పెట్టుకోవడంపై మాజీ సీఎం జగన్ పలుమార్లు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అయితే తనను వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. మంత్రి నారా లోకేశ్ సైతం పలుమార్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే స్థిరమైన అభివృద్ధి సాధించకవచ్చని పిలుపునిస్తున్నారు.

మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మరోవైపు తాము 2029లో అధికారంలోకి వస్తే ‘రప్పా.. రప్పా..’ అంటూ వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు. సుదీర్ఘ ప్రణాళికతో 20, 30 ఏళ్లు అధికారం అంటే ఉపయోగం లేదని భావిస్తున్న చంద్రబాబు ముందుగా ఐదేళ్లు.. తర్వాత మరో ఐదేళ్లు అన్న నినాదాన్ని తలకెత్తుకున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఐదేళ్ల పాలనలో ఏడాది పూర్తయిందని, ఇంకా నాలుగేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారని చెబుతున్నారు. తాను ఒక్కడే కాకుండా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే అధికారం వస్తుందని అంటున్న చంద్రబాబు.. తన దారిలో అడ్డుగా నిలిచే ఎమ్మెల్యేలను వదులుకుంటానని ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే కుమారుడు లోకేశ్ కి అధికార బదిలీ చేయడం సాధ్యమవుతుందన్న ఆలోచన కూడా ఇందులో ప్రధానమంటున్నారు. దీంతో చంద్రబాబు విజన్ 2047కి ముందు టార్గెట్-2029 నిర్దేశించుకున్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News