చంద్రబాబు మాటలు బూమరాంగ్ నా ?

చంద్రబాబు విషయంలో ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే గొప్ప గుణాలు ఉన్నాయి. అవి ఆయన కష్టపడతారు.;

Update: 2025-07-14 10:50 GMT

చంద్రబాబు విషయంలో ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే గొప్ప గుణాలు ఉన్నాయి. అవి ఆయన కష్టపడతారు. సమస్యలు వచ్చినపుడు సవాళ్ళుగా తీసుకుని పనిచేస్తారు. మంచి వ్యూహకర్త అని. అలాగే పట్టుదల కలవారు అని కూడా చెబుతారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అంతా అంగీకరిస్తారు.

అదే చంద్రబాబు విషయంలో అతి ప్రచారాన్ని సొంతంగా తన గురించి గొప్పలు చెప్పుకోవడం కానీ స్వపక్షంలోని వారే ఆక్షేపిస్తారు. బాబు అతి తగ్గించుకుంటే మంచిదని అనేవారూ ఉన్నారు. పైగా బాబు మితిమీరిన మీడియా మోజు అన్న దాని మీద కూడా అయిన వారు సైతం చికాకు పడతారు. అయితే బాబులో ప్లస్ లు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నీ కలిపితేనే చంద్రబాబు అని అంటారు.

ఇక చంద్రబాబు నాలుగవ సారి సీఎం అయ్యారు. వయసు కూడా ఏడున్నర పదులు దాటింది. దేశంలోని సీనియర్ నాయకులలో ఆయన ఒకరిగా ఉన్నారు. ఇక అతి తక్కువ మంది సీనియర్ నేతలలో చురుకైన రాజకీయం నేటికీ చేస్తున్న వారిలో బాబు ముందు వరసలో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే కనుక బాబు అనుభవం సరిసాటి ఎవరూ లేరు.

ఇక వయసు రిత్యా కావచ్చు, అనుభవం రిత్యా కావచ్చు బాబు ఒక్కోసారి తాను అంటున్న మాటలు చేస్తున్న వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు. బాబు చేసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని ఆయన ఏ ఒక్కటీ వదలకుండా ఈ రోజుకీ చెప్పుకుంటారు. అదే సమయంలో తాను చేయని వాటి మీద కూడా ఆయన క్లెయిం చేసుకుని ఆ క్రెడిట్ ని తీసుకోవాలని చూడడమే బూమరాంగ్ అవుతోంది అని అంటున్నారు.

ఎంత మెయిన్ స్ట్రీమ్ మీడియా మద్దతు ఉన్నా సోషల్ మీడియా సమాంతరంగా ఉంది. దాని మీద నియంత్రణ ఎవరికీ ఉండదు, అక్కడ మాత్రం బాబే కాదు ఎవరు ఏమి మాట్లాడినా నెటిజన్లు తమ ఒపీనియన్ చెబుతూ కుండబద్దలు కొట్టేసారు. నిజాలు అలా బయటకు కక్కేస్తారు. ఇక తాజాగా చూస్తే బాబు కొన్ని పధకాలను తనవే అని చెప్పుకోవడం.

ఉదాహరణకు తల్లికి వందనం పధకం అన్న దానిని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది వైసీపీ తీసుకుని వచ్చిన అమ్మ ఒడి పధకానికి పేరు మార్చి అమలు చేస్తున్న పధకం అని లబ్దిదారులతో సహా అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ రోజుకీ పల్లెలలో చాలా మంది దానిని అమ్మ ఒడిగానే చూస్తున్నారు. వారికి ఈ పేరు మార్పులు ఏవీ పెద్దగా తెలియవు అని అంటారు.

మరి ఈ పధకం మేమే తెచ్చామని బాబు చెప్పుకుంటే అది బూమరాంగ్ కాకుండా ఏమవుతుంది అని అంటున్నారు. తల్లికి వందనం అమలు చేసిందే అమ్మ ఒడి డేటాను తీసుకునే కదా అని అంటున్నారు పైగా 13 వేల రూపాయలు వైసీపీ వారు ఎలా ఇచ్చారో టీడీపీ కూటమి అలాగే ఇచ్చింది కదా అని అంటున్నారు.

పైగా ఈ పధకాన్ని లోకేష్ సొంతంగా కనిపెట్టి అమలు చేస్తున్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు అయితే రివర్స్ అవుతున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రోతో పాటు, హైదరాబాబ్ ఎయిర్ పోర్టు నేనే కట్టాను అని బాబు చెప్పుకున్న వాటి మీద కూడా ట్రోల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్నాయి అని గుర్తు చేస్తున్నారు.

అమ్మ ఒడి పధకం నాదే అని చంద్రబాబు అనడంతో పాత వీడియోలను తెచ్చి వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. అందులోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ లోని హైటెక్ సిటీ విషయంలో చంద్రబాబు పూర్తిగా క్లెయిం చేసుకోలేరని అంటున్నారు. దాని మీద అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అని నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎం గా ఉన్నపుడు శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకొచ్చిన పాత వీడియోలని పెట్టి వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తించేస్తోంది.

ఆనాడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ హెల్ప్ చేశారు అని ఆ తరువాత అప్పటి సీఎం జనార్ధనరెడ్డి హైటెక్ సిటీని టేకప్ చేశారు అని గుర్తు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇక నేదురుమల్లి తరువాత చంద్రబాబు సీఎం అయిన నేపథ్యంలో దానిని ముందుకు తీసుకుని వెళ్ళారు తప్పించి పూర్తి క్రెడిట్ ఆయన ఒక్కరికే ఎలా అంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారు.

అలా హైటెక్ సిటీ ఆలోచన అంతా కాంగ్రెస్ దే అని అంతే కాదు అడుగులు కూడా ముందుకు పడింది ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే అంటున్నారు. ఈ విషయాలని ప్రస్తుత తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను వీడియోల రూపయంలో తీసుకొచ్చి మరీ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఇక తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న చంద్రబాబు ఏపీకి ఏమీ చేసింది లేకపోగా తెలంగాణాకు ఎంతో చేశాను అని అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో ఒక్క లెక్కన హాట్ కామెంట్స్ చేస్తోందిట. ఇలా వైసీపీ ట్రోల్స్ ఎక్కువైపోయాయని అంటున్నారు దానికి కారణం అమ్మ ఒడిని తల్లికి వందనంగా పేరు మార్చి మాదే అని చెప్పుకోవడం. ఇలాంటివి మానేస్తే బాగుంటుంది కదా అని సొంత పార్టీలోనూ చర్చ సాగుతోందిట.

Tags:    

Similar News