దేవుణ్ణి బజారులోకి లాగాలనుకోలేదు.... కానీ !

వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకే కాదు దేవుడికి కూడా తీరని ద్రోహం చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.;

Update: 2026-02-28 17:53 GMT

వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకే కాదు దేవుడికి కూడా తీరని ద్రోహం చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా వారు దేవ దేవుడు తిరుమల వేంకటేశ్వర స్వామికే అపచారం తలపెట్టారని ఆయన మండిపడ్డారు. స్వామి ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారని అన్నారు. కెమికల్స్ తో లడ్డూ తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టారని అన్నారు. ఆ విధంగా దేవుడికి కూడా అన్యాయం చేశారని ఆయన అన్నారు. దేవుడికి కూడా ద్రోహం చేసే వారికి వదిలి పెట్టకూడదని అన్నారు.

ప్రజలకు వివరించాను :

అయితే వైసీపీ వారు ఇంత దారుణాలు చేసి దేవుడికే అపచారం చేయడంతో తాను జరిగిన తప్పులను ప్రజలకు వివరించాను అని చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తాను ఎపుడూ ఆ దేవ దేవుణ్ణి బజారులోకి లాగాలనుకోలేదని స్పష్టం చేశారు. .అయితే తప్పులు చేసిన వారే చేసిన తప్పును ఇతరులపై నెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో లడ్డూ నాణ్యత ఎలా ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

రాజకీయాలో ఉండకూడదు :

వైసీపీ లాంటి పార్టీలు నాయకులు రాజకీయాలలో ఉంటే సమస్యలు వస్తాయని బాబు అన్నారు. అసలు వైసీపీ వాళ్లు అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించేందుకు రావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారని ఇది న్యాయమా అని చంద్రబాబు ప్రశ్నించారు. అడ్డదారులు, బెదిరింపులు, దౌర్జాన్యాలతో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని బాబు విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని గంజాయికి నిలయంగా మార్చేశారని బాబు మండిపడ్డారు.

నన్ను జైలులో పెట్టారు :

గత వైసీపీ ప్రభుత్వం చేయని అక్రమాలు లేవని బాబు ఫైర్ అయ్యారు. అందుకే బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళితే ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. ఎవరైనా కూడా కనీసం నవ్వడానికి వీలు లేకుండా పాలన చేశారని అన్నారు. దాంతో ఇళ్లలో ఎవరూ సురక్షితంగా ఉండలేకపోయారని అన్నారు. వైసీపీ రౌడీయిజం పరాకాష్టకు చేరిందని అన్నారు. ఏకంగా తనపైన అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. అయినా సరే తాను ఎక్కడా అసలు కుంగిపోలేదని అన్నారు తాను ప్రజల కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ అందిస్తోందని బాబు చెప్పారు. ప్రజలు ఎన్డీఏను గెలిపించడంతో ఢిల్లీలో కూడా రాష్ట్రం పరపతి పెరిగిందని బాబు చెప్పారు తాము సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళ్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News